Site icon TeluguMirchi.com

తెలంగాణ స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు


కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాల రద్దు కేసుకు సంబంధించి హైకోర్టు మంగళవారం నోటీసులు జారీ చేసింది. కోర్టు ఆదేశించినా ఆ ఎమ్మెల్యేల సభ్యత్వాన్ని పునరుద్దరించకపోవడంతో తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీలకు కోర్టు ధిక్కరణ నోటీసులు ఇచ్చింది.

ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో హైకోర్టు ఆదేశాలు పాటించనందుకు న్యాయమూర్తి శివశంకర్ ఫామ్ 1 జారీ చేస్తూ… వచ్చే నెల 17వ తేదీన తెలంగాణ స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, రాష్ట్ర న్యాయశాఖ సెక్రటరీ విచారణకు స్వయంగా హాజరు కావాలని స్పష్టం చేశారు. అలాగే ఈ ఇద్దరు ఎమ్మెల్యేల జీతభత్యాలు, అసెంబ్లీ రిజిస్టర్ సమర్పించాలని ఆదేశాలు ఇచ్చారు.

ఫిబ్రవరిలో బడ్జెట్‌ సమావేశాల సందర్భంగా.. అనుచితంగా ప్రవర్తించారంటూ కోమటిరెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ సభ్యత్వాలను రద్దు చేయడమే కాకుండా సభ నుంచి బహిష్కరిస్తూ శాసనసభ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. దీన్ని సవాల్ చేస్తూ వారిద్దరూ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వులను తప్పుబట్టడమే కాకుండా వాటిని రద్దు చేస్తూ ఈ ఏడాది ఏప్రిల్‌లో తీర్పు ఇవ్వడం జరిగింది. అయితే అప్పటి నుంచి కాలయాపన జరపడంతో వీరిద్దరూ మళ్లీ న్యాయస్థానం మెట్లు ఎక్కారు.

Exit mobile version