సమతామూర్తి వార్షికోత్సవానికి ప్రధానిని ఆహ్వానించిన చిన్నజీయర్ స్వామి, మైహోమ్ గ్రూప్

Chinajeeyar pmmodi
ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఢిల్లీలోని ఆయన నివాసంలో శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్నజీయర్ స్వామి కలిసారు. ఆయనతో పాటు మైహోమ్ గ్రూప్ చైర్మన్ డా. జూపల్లి రామేశ్వరరావు, ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ రామురావు కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ముచ్చింతల్‌లోని సమతా మూర్తి స్ఫూర్తి కేంద్రం 3వ వార్షికోత్సవం ముగింపు వేడుకలు ఈ ఏడాది చివరలో జరగనున్న నేపథ్యంలో, వాటికి విశిష్ట అతిథిగా హాజరయ్యేలా మోదీకి స్వాగతం పలికారు. ప్రధానమంత్రి మోదీ ఈ ఆహ్వానాన్ని సానుకూలంగా స్వీకరించారు. ఈ సందర్భంగా చిన్నజీయర్ స్వామి సమతా మూర్తి స్ఫూర్తి కేంద్ర విశేషాలను, అక్కడ 108 దివ్య దేశాల దేవతామూర్తులకు నిర్వహించే నిత్య కైంకర్యాలను వివరించారు.

Also Read :  బస్తీ బాట పట్టిన కిషన్ రెడ్డి.. ప్రజలతో ముఖాముఖి!

ఈ భేటీ సుమారు 45 నిమిషాల పాటు సాగింది. ఇందులో జీయర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న నేత్ర విద్యాలయం, ఆయుర్వేద మరియు హోమియోపథీ కళాశాలల పురోగతిని మోదీ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సమాజంలో భక్తిభావాన్ని పెంపొందిస్తున్న ప్రయత్నాలను ప్రధానమంత్రి ప్రశంసించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సమాజానికి సేవలందిస్తున్న మైహోమ్ గ్రూప్ ను మోదీ అభినందించారు.