
Anil Ambani : ప్రముఖ పారిశ్రామికవేత్త, రిలయన్స్ గ్రూప్ ఛైర్మన్ అనిల్ అంబానీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) రూ.17,000 కోట్ల లోన్ మోసం కేసులో సమన్లు జారీ చేసింది. ఆగస్టు 5న ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (PMLA) కింద ఈ కేసు విచారణ జరగనుంది. యెస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రూ.3,000 కోట్ల రుణాన్ని దారి మళ్లించారన్న ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసింది. దీన్ని ఆధారంగా తీసుకుని జూలై 24న ముంబైలో అనిల్ అంబానీ గ్రూప్‌కు చెందిన 35 కార్యాలయాల్లో ఈడీ సోదాలు జరిపింది. మొత్తం 50 కంపెనీలు, 25 మంది బిజినెస్ పార్ట్‌నర్ల ఇళ్లలో మూడు రోజులపాటు సోదాలు చేపట్టిన ఈడీ పలు కీలక డాక్యుమెంట్లతో పాటు హార్డ్ డిస్క్‌లు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.
అంతేకాదు రిలయన్స్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా రూ.10,000 కోట్ల రుణాన్ని మళ్లించారని ఈడీ అనుమానిస్తోంది. యెస్ బ్యాంక్ మాజీ ప్రమోటర్లకు లంచాలు ఇచ్చారన్న ఆరోపణలూ ఉన్నాయి. మొత్తం మీద అనిల్ అంబానీకి చెందిన సంస్థలు వేల కోట్ల బ్యాంకు రుణాలను మళ్లించడంతో పాటు పలు చట్టవ్యతిరేక కార్యకలాపాల్లో చేరిపోయినట్లు అధికార యంత్రాంగం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈడీ చర్యలు మరింత తీవ్రతరం కావొచ్చని అంచనాలు వ్యక్తమవుతున్నాయి.









