AP Cabinet : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ భరోసా, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలు అమల్లో ఉండగా, ఇప్పుడు మరో ముఖ్యమైన హామీ అమలు కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సమావేశం అనంతరం సమాచార ప్రసారశాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఈ నిర్ణయాలను వెల్లడించారు.
మహిళల కోసం ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని ఈ నెల 15 నుంచి ప్రారంభిస్తున్నట్టు మంత్రి ప్రకటించారు. ఈ పథకానికి సీఎం చంద్రబాబు “స్త్రీ శక్తి” అని పేరు పెట్టారు. మంత్రి లోకేష్ చొరవతో రాష్ట్రవ్యాప్తంగా అమలు కానున్న ఈ పథకం ద్వారా ఏడాదికి సుమారు 142 లక్షల మంది మహిళలు లబ్ధి పొందనున్నారని తెలిపారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు.
కేబినెట్లో ఐటీ, టూరిజం, మద్యం విధానం వంటి అంశాలపై కూడా నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రానికి పెద్ద ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు తక్కువ ధరకు భూములు కేటాయించే కొత్త పాలసీకి ఆమోదం తెలిపారు. ప్రతి ఎకరాకు కనీసం 500 ఉద్యోగాలు కల్పించే విధంగా పాలసీ రూపొందించినట్టు మంత్రి తెలిపారు. పర్యాటక రంగంలో ఏపీటీడీసీ నిర్వహిస్తున్న హోటళ్లతో పాటు రిసార్ట్స్, స్టార్ హోటళ్లు ఏర్పాటు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అనుమతులు ఇవ్వాలని నిర్ణయించారు.
కొత్త బార్ పాలసీ కింద అన్ని ఏ-4 షాపులకు పర్మిట్ రూములు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. అదేవిధంగా, నాయి బ్రాహ్మణ వర్గానికి చెందిన సెలూన్ నిర్వాహకులకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను అందించనున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 40,808 సెలూన్లకు ఈ ప్రయోజనం వర్తిస్తుందని పేర్కొన్నారు. జర్నలిస్టుల కోసం కొత్త అక్రిడేషన్ పాలసీకి ఆమోదం తెలిపి, ఎక్కువ మంది జర్నలిస్టులకు కార్డులు ఇవ్వడానికి మార్గం సుగమం చేశామని చెప్పారు. సోషల్ మీడియాపై ప్రత్యేక పాలసీ తీసుకురావాలని సీఎం సూచించారని వెల్లడించారు. మరోవైపు, కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్టు)పై నిషేధాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పార్థసారథి తెలిపారు.













