Ratan Tata Innovation Hub : 24 గంటల్లో 1.67 లక్షల రిజిస్ట్రేషన్లు.. ఏపీకి గిన్నిస్ రికార్డు గౌరవం

Tata hub

Ratan Tata Innovation Hub :ఆంధ్రప్రదేశ్‌ను ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. యువ ఔత్సాహికులు, స్టార్టప్‌లకు మద్దతు ఇవ్వడానికి రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌ను మంగళగిరిలోని మయూరి టెక్ సెంటర్‌లో టాటా సన్స్ చైర్మన్ చంద్రశేఖరన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో అమరావతి సహా విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, అనంతపురంలో ఇన్నోవేషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. రాబోయే రోజుల్లో 175 నియోజకవర్గాలందరికీ ఇన్నోవేషన్ కేంద్రాలను తీసుకురావాలని సీఎం తెలిపారు. యువత ఆలోచనలకు వేదికగా, స్టార్టప్‌లకు ప్రోత్సాహకంగా ఈ హబ్‌లు పనిచేస్తాయని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.

భవిష్యత్తులో అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దే ప్రణాళికలున్నాయని సీఎం వెల్లడించారు. వ్యవసాయం, విద్య, వైద్యం, రక్షణ తదితర రంగాల్లో విప్లవాత్మక పరిష్కారాలు ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారానే వస్తాయని ఆయన స్పష్టం చేశారు. “ఒక్కో ఇంట్లో ఒక పారిశ్రామిక వేత్త ఉండాలి. సంపద పెరిగితేనే సంక్షేమం సాధ్యం. టూరిజం, స్టార్టప్‌లు, పరిశ్రమలు – ఇవన్నీ ఏపీ అభివృద్ధికి బాటలు వేస్తాయి” అని చంద్రబాబు అన్నారు. ఈ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభోత్సవం సందర్భంగా ఏపీలో రికార్డు స్థాయిలో 1,67,321 రిజిస్ట్రేషన్లు 24 గంటల్లో నమోదయ్యాయి. దీంతో ఏపీ ఇన్నోవేషన్ సొసైటీకి గిన్నిస్ వరల్డ్ రికార్డు లభించింది. గిన్నిస్ ప్రతినిధులు సీఎం చంద్రబాబుకు సర్టిఫికేట్ అందజేశారు.