రివ్యూ: వన్/4

One by four review

తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5

వెంకటేష్, అపర్ణ మల్లిక్, హీనా సోనీ, టెంపర్ వంశీ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘వన్/4’. తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ నిర్మాణంలో, బాహుబలి పళని కె దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జనవరి 30న థియేటర్లలో విడుదలైంది.

కథ: వైజాగ్‌లో నివసించే కిరణ్ (వెంకటేష్) చదువు పూర్తయ్యాక జాబ్ జాయిన్ అయ్యేలోపు కొంతకాలం జీవితాన్ని ఎంజాయ్ చేస్తూ గడుపుతుంటాడు. అతని కాలనీలోనే పవిత్ర (హీనా సోనీ) తన పిల్లలతో కలిసి జీవిస్తుంది. ఆమె భర్త ఉద్యోగరీత్యా దుబాయ్‌లో ఉంటాడు. పవిత్ర కాలేజ్ ఫ్రెండ్ ఒకరు ప్రొఫెసర్‌గా వైజాగ్‌కు ట్రాన్స్ఫర్ కావడంతో అప్పుడప్పుడు ఫ్యామిలీలతో కలుస్తుంటారు. మొదట పవిత్ర–ప్రొఫెసర్ మధ్య ఉన్న బంధాన్ని తప్పుగా అర్థం చేసుకున్న కిరణ్, తర్వాత అది స్వచ్ఛమైన స్నేహం అని తెలుసుకుంటాడు. ఒక సంఘటన కారణంగా కిరణ్‌కు బైక్ మెకానిక్ (టెంపర్ వంశీ)తో పరిచయం ఏర్పడుతుంది. అతడు మరియు అతని ముగ్గురు స్నేహితులు ‘వన్/4 షేరింగ్’ అంటూ అక్రమ మార్గాల్లో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. ఈ విషయం కిరణ్‌కు తెలియకుండా అతనితో సన్నిహితంగా మెలుగుతారు.

ఒక మందు సిట్టింగ్‌లో కిరణ్, పవిత్ర మంచితనం గురించి చెప్పడంతో, ఈ నలుగురు పవిత్ర–ప్రొఫెసర్ కలిసి ఉన్న వీడియోలను తీసి ఆమె భర్తకు పంపిస్తామని బెదిరించి డబ్బులు వసూలు చేస్తారు. ఆ తర్వాత మరింత డబ్బుల కోసం పవిత్రపై ఘోరమైన నేరానికి పాల్పడతారు. ఈ విషయం పవిత్ర బయటకు చెబుతుందా? కిరణ్‌కు అసలు నిజం ఎలా తెలుస్తుంది? ఆ నలుగురిపై కిరణ్ ఎలా ప్రతీకారం తీర్చుకుంటాడు? మధ్యలో కిరణ్ లవ్ స్టోరీ ఏంటి? అన్నదే మిగతా కథ.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

విశ్లేషణ: ఫస్ట్ హాఫ్ ఎక్కువగా పాత్రల పరిచయాలు, లవ్ ట్రాక్‌తో సాగుతుంది. ఈ భాగం కొంత బోర్ కొట్టేలా అనిపిస్తుంది. పవిత్రను వన్ బై ఫోర్ గ్యాంగ్ టార్గెట్ చేసిన దగ్గర నుంచి కథ ఆసక్తికరంగా మారుతుంది. ఇంటర్వెల్‌కు ముందు ఎమోషన్ బాగానే వర్కౌట్ అయింది. సెకండ్ హాఫ్‌లో కూడా ఎమోషన్‌తో పాటు రివెంజ్ అంశాన్ని దర్శకుడు బాగానే డీల్ చేశాడు. హీరో తీసుకునే ప్రతీకార మార్గంలో వచ్చే ట్విస్ట్ స్క్రీన్‌ప్లేకు ప్లస్ అయ్యింది. అయితే అక్రమాలకు పాల్పడే ఓ గ్యాంగ్, హీరోకి సంబంధించిన వ్యక్తిని ఇబ్బంది పెట్టడం, దానికి హీరో రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశం కొత్తది కాదు. టెంపర్ వంశీ, అతని బ్యాచ్ తాగే సీన్స్ ఎక్కువగా సాగదీశారు—వాటిని తగ్గించి ఉంటే సినిమా మరింత క్రిస్ప్‌గా ఉండేది. లవ్ స్టోరీ సింపుల్‌గా సాగుతుంది. కామెడీ ప్రయత్నాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. చివర్లో ఇచ్చిన మెసేజ్ మాత్రం బాగుంది.

Also Read :  రివ్యూ : విష్ణు విన్యాసం

నటీనటుల నటన: కన్నడలో హీరోగా చేసిన అనుభవంతో వెంకటేష్ తెలుగులో కూడా మంచి ఇంపాక్ట్ చూపించాడు. హీనా సోనీ పవిత్ర పాత్రలో పూర్తిగా ఒదిగిపోయి, ఎమోషనల్ సీన్స్‌ను బాగా పండించింది. అపర్ణ మల్లిక్ పాత్ర పరిమితంగానే ఉంటుంది. టెంపర్ వంశీ విలన్ షేడ్స్‌లో ఆకట్టుకున్నాడు. మిగిలిన నటీనటులు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతిక అంశాలు: సినిమాటోగ్రఫీ బాగుంది, విజువల్స్ ఆకట్టుకుంటాయి. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని చోట్ల అవసరానికి మించి హెవీగా అనిపిస్తుంది. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్‌లో ల్యాగ్ ఉన్న సీన్స్ కట్ చేసి ఉంటే రన్‌టైమ్ మరింత బెటర్ అయ్యేది. పాత కథే అయినా కొత్త స్క్రీన్‌ప్లేతో చెప్పేందుకు దర్శకుడు ప్రయత్నించాడు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

తుది మాట: ‘వన్/4’ ఓ సోషల్ మెసేజ్‌తో సాగిన సస్పెన్స్–రివెంజ్ డ్రామా. కొత్తదనం ఆశించే వారికి కాకపోయినా, ఎమోషన్, మెసేజ్ ఇష్టపడే వారికి ఒకసారి చూడదగ్గ సినిమా.

తెలుగుమిర్చి రేటింగ్ : 2.75/5