Abhijit Dipke: ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే.. లేదంటే దేశవ్యాప్త ఉద్యమం: కాక్రోచ్ జనతా పార్టీ

Abhijit Dipke

Abhijit Dipke: వివిధ జాతీయ స్థాయి పరీక్షల్లో వరుసగా వెలుగు చూస్తున్న అక్రమాలు, అవకతవకలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాల వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడుతోందని ఆయన మండిపడ్డారు. మహారాష్ట్రలోని పుణెలో నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో అభిజీత్ దిప్కే మాట్లాడుతూ.. విద్యార్థుల సమస్యలపై దేశ యువత ఇకపై మౌనంగా ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. జూన్ 13 వ తేదీ లోగా కేంద్ర విద్యాశాఖ మంత్రి తన పదవికి రాజీనామా చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు.

కోటి మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో..
నీట్ (NEET) పరీక్ష వివాదాల కారణంగా దేశంలో పలువురు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని దిప్కే ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నీట్ మాత్రమే కాకుండా సీబీఎస్‌ఈ (CBSE), సీయూఈటీ (CUET) వంటి ప్రతిష్టాత్మక పరీక్షల్లో పేపర్ లీక్‌లు, సర్వర్ వైఫల్యాల వల్ల కోటి మందికి పైగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోయారని ఆయన ఆరోపించారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఎవరూ బాధ్యత తీసుకోకపోవడం దారుణమన్నారు. “వ్యవస్థ వైఫల్యాల వల్ల రేపు డాక్టర్లు అయి ప్రాణాలు కాపాడాల్సిన విద్యార్థులు, ఈరోజు తమ ప్రాణాలను కోల్పోతున్నారు. ఈ విద్యా వ్యవస్థ వైఫల్యాలకు ఎవరో ఒకరు బాధ్యత వహించాల్సిందే. అందుకే జూన్ 6న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలిపి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాను డిమాండ్ చేశాం” అని దిప్కే పేర్కొన్నారు.

Also Read :  West Bengal : బెంగాల్‌లో మమతా బెనర్జీ ప్రభుత్వ సంక్షోభానికి అసలు కారణం ఇదేనా?

పోరాటాల రూట్ మ్యాప్.. జూన్ 20న ‘చలో ఢిల్లీ’
ఒకవేళ జూన్ 13 లోగా రాజీనామా రాకుంటే, ఆందోళనల పరంపరను పుణె నుంచే స్టార్ట్ చేస్తామని దిప్కే వెల్లడించారు. జూన్ 11 (సాయంత్రం 4 గంటలకు) పుణెలో శాంతియుత నిరసన ప్రదర్శన ఉంటుందని, తదుపరి లక్నో, అమృత్‌సర్, జైపూర్, బెంగళూరు నగరాల్లో భారీ నిరసనలు చేస్తామన్నారు. ఒకవేళ అప్పటికీ మంత్రి దిగిరాకపోతే దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు, యువత అంతా జూన్ 20న ఢిల్లీ చేరుకుని నిరసనల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ ‘చలో ఢిల్లీ’ ఆందోళనలో తాను స్వయంగా పాల్గొంటానని ప్రకటించారు. చివరగా ఆయన ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి మాట్లాడుతూ.. ప్రధానమంత్రి గారు రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించగలిగినప్పుడు, దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు కోసం కేంద్ర విద్యాశాఖ మంత్రి చేత రాజీనామా చేయించడం పెద్ద విషయమేమీ కాదని వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.