Ramayana: రామాయణ ట్రైలర్ వాయిదా.. ప్రపంచవ్యాప్త డిస్ట్రిబ్యూషన్‌కు సోనీ పిక్చర్స్ రంగంలోకి!

Cinema

Ramayana: పాన్ ఇండియా స్థాయిలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న ‘రామాయణ’ సినిమాపై ప్రేక్షకుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్రముఖ హాలీవుడ్ సంస్థ సోనీ పిక్చర్స్ రంగంలోకి దిగినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అంతర్జాతీయ స్థాయిలో భారీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లేందుకు సోనీ పిక్చర్స్ భాగస్వామ్యం కావడం చిత్రానికి మరింత బలం చేకూర్చే అంశంగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

ఇదిలా ఉండగా ఈరోజు రిలీజ్ కావాల్సిన ‘రామాయణ’ ట్రైలర్‌ను వాయిదా వేస్తున్నట్లు నిర్మాత నమిత్ మల్హోత్రా అధికారికంగా ప్రకటించారు. ట్రైలర్ విడుదల తేదీని త్వరలోనే వెల్లడిస్తామని ఆయన తెలిపారు. నీట్ పేపర్ లీక్ కారణంగా ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర విద్యార్థులు నిరసన చేస్తున్న నేపథ్యంలో, ఈ టైంలో ట్రైలర్ రిలీజ్ చేయడం కరెక్ట్ కాదని మేకర్స్ అభిప్రాయపడినట్లు సమాచారం. త్వరలోనే ట్రైలర్ రిలీజ్‌కు కొత్త డేట్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ నితీష్ తివారి అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. భారతీయ ఇతిహాసమైన రామాయణాన్ని అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అంతర్జాతీయ స్థాయి సాంకేతిక ప్రమాణాలతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సినిమాలో రణబీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో కనిపించనుండగా, సాయిపల్లవి సీత పాత్రను పోషిస్తున్నారు. యష్ రావణుడి పాత్రలో నటిస్తుండటంతో ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. స్టార్ క్యాస్టింగ్, విజువల్ గ్రాండియర్, అంతర్జాతీయ విడుదల ప్రణాళికలతో ‘రామాయణ’ ఇప్పటికే అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న భారతీయ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.