Ajith Kumar: నిర్మాతల కోసం తగ్గిన అజిత్ కుమార్.. ఏకంగా ₹35 కోట్లు కోత.. కానీ!

Ajith Kumar

Ajith Kumar: తమిళ చిత్ర పరిశ్రమలో (కోలీవుడ్) భారీ మార్కెట్ – క్రేజ్ ఉన్న స్టార్ హీరోలలో ‘తలా’ అజిత్ కుమార్ ఒకరు. ప్రస్తుతం సినిమా నిర్మాణ వ్యయం పెరిగిపోతుండటం, బాక్సాఫీస్ సమీకరణాలు మారుతుండటంతో అజిత్ కుమార్ తాజాగా తన రెమ్యూనరేషన్ విషయంలో ఒక సంచలన నిర్ణయం తీసుకున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. తన రాబోయే ప్రాజెక్ట్‌లు నిర్మాతలకు ఆర్థికంగా భారంగా మారకూడదనే ఉద్దేశంతో ఆయన తన పారితోషికాన్ని తగ్గించుకున్నట్లు సమాచారం.

తాజా సమాచారం ప్రకారం.. అజిత్ కుమార్ తన గత చిత్రాలకు దాదాపు రూ.185 కోట్ల భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేసేవారట. అయితే ప్రస్తుత మార్కెట్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని, తన కొత్త సినిమాల బడ్జెట్ అదుపులో ఉండేలా చూసేందుకు ఆయన తన పారితోషికాన్ని రూ.150 కోట్లకు తగ్గించుకున్నట్లు తెలుస్తోంది. అజిత్ కుమార్ ఏకంగా రూ.35 కోట్లు తగ్గించుకున్నప్పటికీ.. కొందరు నిర్మాతలు మాత్రం ఆయన నుంచి మరికొంత తగ్గింపును ఆశిస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. ప్రస్తుత బాక్సాఫీస్ బిజినెస్ రేంజ్, థియేట్రికల్ అండ్ నాన్-థియేట్రికల్ మార్కెట్ డైనమిక్స్‌ను పరిగణనలోకి తీసుకుంటే, అజిత్ పారితోషికం రూ.90 కోట్ల నుంచి రూ.110 కోట్ల మధ్యలో ఉంటేనే ప్రాజెక్టులు మరింత సేఫ్ జోన్‌లోకి వస్తాయని సదరు నిర్మాతలు భావిస్తున్నారట. ప్రస్తుతం సౌత్ ఇండియన్ సినిమా మార్కెట్ భారీగా విస్తరించినప్పటికీ, ఓపెనింగ్స్ – లాంగ్ రన్ కలెక్షన్ల పరంగా రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా పెరిగాయి. స్టార్ హీరోల పారితోషికాలే సినిమా బడ్జెట్‌లో సింహభాగం ఆక్రమిస్తుండటంతో, నిర్మాణ వ్యయం పెరిగిపోయి డిస్ట్రిబ్యూటర్లపై భారం పడుతోందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే అజిత్ పారితోషికంపై జరుగుతున్న ఈ చర్చ ఇప్పుడు సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.