Vrushakarma: వృషకర్మకు భారీ డీల్.. రిలీజ్‌కు ముందే కోట్లల్లో నాన్-థియేట్రికల్ బిజినెస్?

Vrushakarma

Vrushakarma: అక్కినేని నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ‘వృషకర్మ’. ఈ చిత్రంపై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘విరూపాక్ష’ చిత్రంతో సెన్సేషనల్ సక్సెస్‌ అందుకున్న డైరెక్టర్ కార్తీక్ దండు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ థ్రిల్లర్‌పై ఇప్పటికే సినీ వర్గాల్లో భారీ హైప్ నెలకొంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ మీడియా సంస్థ జీ (Zee) ఈ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్‌ను ఏకంగా రూ.48 కోట్లకు సొంతం చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ డీల్‌లో శాటిలైట్ రైట్స్‌తో పాటు ఓటీటీ రైట్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. సినిమా థియేటర్లలో విడుదల కాకముందే ఇంత భారీ మొత్తానికి డీల్ కుదిరిందనే వార్తలు రావడంతో ‘వృషకర్మ’పై ఉన్న క్రేజ్ ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఈ వార్త నిజమైతే నాగచైతన్య కెరీర్‌లోనే ఇది అతిపెద్ద నాన్-థియేట్రికల్ డీల్స్‌లో ఒకటిగా నిలిచే అవకాశం ఉందని సమాచారం. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర (SVCC), సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఈ సినిమాలో నాగచైతన్య సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తుండగా, దర్శకుడు కార్తీక్ దండు మరోసారి సరికొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నారు. పౌరాణిక అంశాలను థ్రిల్లింగ్ కథనంతో మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే రూ.48 కోట్ల నాన్-థియేట్రికల్ డీల్‌కు సంబంధించిన వార్తలపై ఇప్పటివరకు చిత్రబృందం గానీ, జీ సంస్థ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.