Rakul Preet Singh: ‘శూర్పణఖను తప్పుగా అర్థం చేసుకున్నారు’.. రకుల్ ప్రీత్ సింగ్ షాకింగ్ కామెంట్స్!

Rakul

Rakul Preet Singh: బాలీవుడ్ దర్శకుడు నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రం ‘రామాయణ’లో శూర్పణఖ పాత్రను పోషిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ తన పాత్ర ఎంపిక వెనుక ఉన్న కారణాన్ని తాజాగా వెల్లడించారు. చాలామంది శూర్పణఖను ఒకే సంఘటనతో గుర్తు పెట్టుకుంటారని, కానీ ఆ పాత్రలో అంతకంటే ఎక్కువ భావోద్వేగాలు, సంక్లిష్టత దాగి ఉందని ఆమె వెల్లడించారు. ఇటీవల ఓ అభిమాని రకుల్‌కు బహిరంగ లేఖ రాస్తూ శూర్పణఖ పాత్రను అంగీకరించినందుకు అభినందించారు. రామాయణ కథలో ఈ పాత్రను కేవలం ఒక సంఘటనకే పరిమితం చేయడం సరైనది కాదని, కథను కీలక మలుపు తిప్పిన పాత్రల్లో శూర్పణఖ ఒకరని పేర్కొంటూ, అలాంటి పాత్రను ఎంచుకోవడానికి ప్రేరణ ఏమిటని ప్రశ్నించారు.

దీనికి ‘ఎక్స్’ వేదికగా స్పందించిన రకుల్ ప్రీత్ సింగ్.. శూర్పణఖ పాత్రలోని సంక్లిష్టతే తనను ఎక్కువగా ఆకర్షించిందని తెలిపారు. చరిత్ర ఆమెను ఒక సందర్భంతో మాత్రమే గుర్తుంచుకుందని, కానీ ఆ పాత్రలో ఇంకా ఎన్నో కోణాలు ఉన్నాయని చెప్పారు. ప్రేక్షకుల అభిప్రాయాలను సవాలు చేసే, కొత్త దృక్కోణాన్ని చూపించే పాత్రల్లో నటించడం తనకు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుందని వెల్లడించారు. అలాగే ‘రామాయణ’ సినిమా విడుదలైన తర్వాత శూర్పణఖ పాత్రను ప్రేక్షకులు కొత్త కోణంలో చూసే అవకాశం ఉంటుందని రకుల్ ఆశాభావం వ్యక్తం చేశారు. నితీశ్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ భారీ పాన్-ఇండియా చిత్రాన్ని నమిత్ మల్హోత్రా, రాకింగ్ స్టార్ యశ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.