Rajinikanth Life Story: తెరపై కాదు.. తొలిసారి పుస్తకంలో రజనీకాంత్‌ జీవితం! కుమార్తె సౌందర్య కీలక ప్రకటన

Rajinikanth Life Story

Rajinikanth Life Story:సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ తన ఐదు దశాబ్దాల సినీ ప్రయాణాన్ని, జీవితంలోని అనుభవాలను పుస్తక రూపంలో అభిమానుల ముందుకు తీసుకురానున్నారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుమార్తె, డైరెక్టర్ సౌందర్య రజనీకాంత్‌ తాజాగా వెల్లడించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సౌందర్య.. రజనీకాంత్‌ జీవిత కథను పుస్తకంగా రూపొందించే ప్రక్రియ ఎంతో ప్రత్యేకంగా సాగుతోందని తెలిపారు. సినీ రంగంలో ఆయన సాధించిన విజయాలతో పాటు, వ్యక్తిగత అనుభవాలు, అగ్రస్థానానికి చేరుకునే క్రమంలో ఎదుర్కొన్న సవాళ్లను ఇందులో పొందుపరుస్తున్నట్లు చెప్పారు.

పరమహంస యోగానంద రచించిన ‘ఒక యోగి ఆత్మకథ’ తరహాలో రజనీకాంత్‌ జీవిత కథ కూడా తరతరాలకు స్ఫూర్తినిచ్చేలా ఉంటుందని సౌందర్య అభిప్రాయపడ్డారు. ఒకవేళ తన తండ్రి జీవితాన్ని సినిమాగా తెరకెక్కించే అవకాశం వస్తే, అది తనకు ఎంతో ప్రత్యేకమైన ప్రాజెక్ట్‌ అవుతుందని వెల్లడించారు. సృజనాత్మకతలో స్పష్టతతో పాటు క్రమశిక్షణ ఎంత ముఖ్యమో తన తండ్రి నుంచే నేర్చుకున్నానని సౌందర్య తెలిపారు. ఇక ప్రస్తుతం సౌందర్య నిర్మాణంలో నెట్‌ఫ్లిక్స్‌ కోసం ‘లవ్‌’ అనే రొమాంటిక్‌ తమిళ వెబ్‌సిరీస్‌ తెరకెక్కుతుంది. బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సిరీస్‌లో అర్జున్‌ దాస్‌, ఐశ్వర్య లక్ష్మి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సిరీస్‌ అక్టోబర్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ కానుంది.