
Natural Star Nani: సినిమా ఎంత పెద్దదైనా విడుదలకు ముందే బాక్సాఫీస్ మూడ్‌ను సెట్ చేసేది ‘థియేట్రికల్ ట్రైలర్’. అలాంటిది ఆకాశాన్ని తాకే హైప్‌తో రాబోతున్న ఒక భారీ పాన్-ఇండియా చిత్రానికి అసలు ట్రైలరే ఉండదని చెబితే ఎవరైనా నమ్ముతారా? కానీ నేచురల్ స్టార్ నాని ఇదే షాకింగ్ నిజాన్ని కుండబద్దలు కొట్టారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ యాక్షన్ డ్రామా ‘ది పారడైజ్’ చిత్రానికి ఎలాంటి ట్రైలర్ రిలీజ్ చేయడం లేదని నాని అధికారికంగా స్పష్టం చేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీతో పాటు సోషల్ మీడియాలోనూ సంచలనం సృష్టిస్తున్నాయి.
ట్రైలర్ లేకపోవడంపై వివరణ ఇస్తూ నాని ఒక ఎమోషనల్ అండ్ ప్రాక్టికల్ పాయింట్‌ను బయటపెట్టారు. “సినిమాపై విపరీతమైన బజ్ ఉంది.. ఎలాగూ భారీ ఓపెనింగ్స్ వస్తాయి కదా అని ప్రేక్షకులను మేము తేలిగ్గా తీసుకోవడం లేదు. ఒకవేళ ట్రైలర్ ఇస్తే అది అదిరిపోయే రేంజ్లో ఉండాలి. అలాంటి అదిరిపోయే అవుట్‌పుట్ రావాలంటే డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సహా టీమ్ అంతా చేస్తున్న పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ పక్కనపెట్టి కనీసం నాలుగు రోజులు దీనిపైనే కూర్చోవాలి” అని నాని వెల్లడించారు.
సినిమా రిలీజ్ సమయం దగ్గరపడుతున్న వేళ నాణ్యత విషయంలో రాజీపడకూడదనే ఉద్దేశంతోనే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు నాని తెలిపారు. “మాకూ అదిరిపోయే ట్రైలర్ కట్ చేసి చూపించాలని ఉంది. కానీ ఆఖరి నిమిషంలో ఉన్న తక్కువ సమయంలో ట్రైలర్ కోసం విలువైన రోజులను కేటాయించడం కంటే, థియేటర్లలో పడే మెయిన్ సినిమా అవుట్‌పుట్‌ను పర్ఫెక్ట్గా తీసుకురావడమే అత్యంత ముఖ్యం అనిపించింది. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టీమ్ మొత్తం చర్చించుకుని ట్రైలర్ వద్దనే నిర్ణయానికి వచ్చాం” అని నాని తేల్చేశారు.
ఇతర భాషల్లో ముఖ్యంగా హిందీ మార్కెట్లో ఏదైనా నిర్దిష్ట టార్గెట్ ఉందా? అన్న ప్రశ్నకు నాని క్లారిటీతో సమాధానమిచ్చారు. “మాకు ఎలాంటి ప్రత్యేక టార్గెట్లు లేవు. ‘పారడైజ్’ మొదటిగా ఒక స్వచ్ఛమైన తెలుగు సినిమా. అయితే తెలుగు ఆడియన్స్ సినిమా చూసి ఎలాంటి ఫీల్, ఎమోషన్‌కు లోనవుతారో.. ఇతర భాషల ప్రేక్షకులు కూడా డబ్బింగ్ సరిగ్గా లేదనో, క్వాలిటీ లోపించిందనో డిజప్పాయింట్ అవ్వకూడదు. అందుకే అత్యుత్తమ డబ్బింగ్, హై-క్వాలిటీతో అన్ని భాషల్లోనూ ఈ సినిమాను అందుబాటులో ఉంచుతున్నాం. ఆలస్యమైనప్పటికీ శ్రీకాంత్ ఊహించిన విజన్‌ను వెండితెరపై భారీ ఎత్తున ప్రేక్షకుల ముందుకు తెస్తున్నాం” అని నాని ధీమా వ్యక్తం చేశారు.













