
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం – ఏకే 47’ విడుదలపై చిత్రబృందం ఊహించని ట్విస్ట్ ఇచ్చింది. గాంధీ జయంతి కానుకగా అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా విడుదల అనూహ్యంగా వాయిదా పడింది. ముందుగా ప్రకటించిన తేదీ కంటే వారం రోజుల పాటు సినిమాను వెనక్కి నెడుతున్నట్లు మేకర్స్ ప్రకటించడం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
నిర్మాత ఎస్.రాధాకృష్ణ ఈ సినిమాను అక్టోబరు 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు అధికారికంగా స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సరికొత్త పోస్టర్‌ను విడుదల చేస్తూ తాజా తేదీని మేకర్స్ ధ్రువీకరించారు. విడుదల తేదీలో మార్పు జరగడానికి గల ఖచ్చితమైన కారణాలను నిర్మాతలు వెల్లడించకపోయినప్పటికీ, దసరా పండుగ సీజన్‌ను పూర్తి స్థాయిలో క్యాష్ చేసుకోవడానికే ఈ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నట్లు సినీ విశ్లేషకులు భావిస్తున్నారు.
టైటిల్‌లోనే ‘ఆదర్శ కుటుంబం’ అనే క్లాస్ టచ్‌తో పాటు ‘ఏకే 47’ అనే మాస్ ఎలిమెంట్‌ను జోడించి మొదటి నుంచీ సినిమాపై త్రివిక్రమ్ భారీ అంచనాలు పెంచేశారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ నటిస్తున్న ఈ చిత్రంలో నారా రోహిత్, నివేదా పేతురాజ్, రావు రమేశ్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చాలా కాలం తర్వాత వెంకటేశ్ మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కు త్రివిక్రమ్ పదునైన సంభాషణలు తోడవనుండటంతో, వారం ఆలస్యమైనా థియేటర్లలో వినోదాల విందు గ్యారెంటీ అని సినీ ప్రియులు గట్టిగా నమ్ముతున్నారు.














