
Shah Rukh Khan: బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఆర్థిక సామ్రాజ్యానికి ఊహించని కుదుపు తగిలింది. కేవలం ఒక్క ఏడాది వ్యవధిలోనే ఆయన నికర ఆస్తి విలువలో వేల కోట్ల రూపాయలు కరిగిపోవడం వ్యాపార, సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ‘హురున్ ఇండియా రిచ్ లిస్ట్ 2026’ తాజాగా వెల్లడించిన గణాంకాల ప్రకారం.. గతేడాది ఏకంగా రూ. 12,490 కోట్లుగా ఉన్న షారుఖ్ నికర సంపద, ఈ ఏడాదికి వచ్చేసరికి రూ. 2,490 కోట్లు తగ్గి రూ. 10,000 కోట్లకు పడిపోయింది. షారుఖ్ ఖాన్ కేవలం సినిమాల ద్వారా మాత్రమే కాకుండా, పలు కీలక వాణిజ్య రంగాల్లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఆయన నిర్మాణ సంస్థ ‘రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్’తో పాటు, ఐపీఎల్లో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటైన ‘కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)’ స్పోర్ట్స్ వెంచర్లలో ఆయనకు భారీ వాటాలు ఉన్నాయి. మార్కెట్ ఒడిదుడుకులు, వ్యాపార భాగస్వామ్యాల విలువల్లో మార్పుల కారణంగానే ఆయన సంపద ఇంత భారీ మొత్తంలో తగ్గిపోయినట్లు నివేదిక స్పష్టం చేసింది.
సంపదలో ఏకంగా రూ. 2,490 కోట్లు నష్టం వాటిల్లినప్పటికీ, భారతదేశంలో అత్యంత ధనిక నటుడిగా షారుఖ్ ఖాన్ తన అగ్రస్థానాన్ని కాపాడుకోవడం గమనార్హం. ఆయన పీఠాన్ని కదిలించడం ఇప్పట్లో ఎవరి వల్లా కాదని జాబితాలోని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. రూ. 4,000 కోట్ల నికర ఆస్తులతో బిగ్ బి అమితాబ్ బచ్చన్ రెండో స్థానంలో ఉన్నారు. సల్మాన్ ఖాన్ రూ. 3,000 కోట్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నారు.
బాలీవుడ్ హ్యాండ్సమ్ హంక్ హృతిక్ రోషన్ రూ. 2,500 కోట్ల సంపదతో తర్వాతి స్థానంలో నిలిచారు. రెండో స్థానంలో ఉన్న అమితాబ్ కంటే షారుఖ్ సంపద ఇంకా రెట్టింపు కంటే ఎక్కువగా ఉండటం బాద్షా ఆర్థిక స్థాయిని అద్దం పడుతోంది.
ఒకవైపు ఆర్థిక నివేదికల లెక్కలు ఎలా ఉన్నా, సినీ రంగంలో మాత్రం షారుఖ్ తన పట్టును మరింత బిగించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆయన సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’ ప్రాజెక్ట్‌తో బిజీగా ఉన్నారు. సుమారు రూ. 450 కోట్ల భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ చిత్రంలో షారుఖ్ తన కుమార్తె సుహానా ఖాన్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు. డిసెంబరు 24న క్రిస్మస్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.














