
Sampoornesh Babu: నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన తాజా సెన్సేషన్ ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద రికార్డు వసూళ్లతో దూసుకుపోతోంది. ఈ భారీ విజయాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన మీడియా ములాఖత్‌లో ‘బర్నింగ్ స్టార్’ సంపూర్ణేష్ బాబు మాట్లాడిన మాటలు ఆడియన్స్‌తో కంటతడి పెట్టించాయి. ఇప్పటివరకు కేవలం పేరడీ, స్పూఫ్ కామెడీలకే పరిమితమైన సంపూ.. ఈ చిత్రంలో ‘బిర్యానీ’ అనే సీరియస్ పాత్రలో సరికొత్తగా మెరిసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఈ సందర్భంగా తన కెరీర్ ముగిసిపోయిందనుకున్న కష్టకాలాన్ని గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన కామెంట్స్ భావోద్వేగాన్ని రేకెత్తించాయి.
గత కొన్నేళ్లుగా అవకాశాలు లేక తాను ఎదుర్కొన్న గడ్డు పరిస్థితులను సంపూ అత్యంత నిజాయతీగా బయటపెట్టారు. “‘హృదయ కాలేయం’, ‘కొబ్బరిమట్ట’ చిత్రాలు విడుదలైనప్పుడు ఎంతో సందడి నడిచింది. కానీ ఆ తర్వాత నా ఫోన్ పూర్తిగా ఆగిపోయింది. మధ్యలో ఎన్నో సినిమాలు వచ్చాయి.. అలా వచ్చి అలా వెళ్లిపోయాయి తప్ప నా ఫోన్ మాత్రం ఒక్కసారి కూడా మోగలేదు. ఇంకా సంపూ పని అయిపోయింది.. ఏదో నాలుగు స్పూఫ్ కామెడీలు చేశాడు, ఇక అతనితో ఏమీ కాదనుకుని అంతా పక్కన పెట్టేసిన సమయంలో శ్రీకాంత్ అన్న నాలో ఉన్న సరికొత్త నటుడిని గుర్తించారు” అంటూ ఉద్వేగానికి లోనయ్యారు.
తన సినీ పునర్జన్మ గురించి చెబుతూ.. “నాడు డైరెక్టర్ స్టీవెన్ శంకర్ (రాజేష్ దండ) సంపూర్ణేష్ బాబు అనే ఒక నటుడిని పుట్టిస్తే, నేడు డైరెక్టర్ శ్రీకాంత్ అన్న ‘ది ప్యారడైజ్’ ద్వారా నాకు బిర్యానీ అనే కొత్త పాత్రతో రెండో జన్మనిచ్చాడు. చదువుకునే రోజుల్లో ఎవరి డైలాగులైతే అనుకరిస్తూ తిరిగానో, సాక్షాత్తూ అదే మోహన్ బాబు గారి పక్కన నిలబడి నటించే మహత్తర అవకాశాన్ని శ్రీకాంత్ అన్న కల్పించాడు. ఆయనకు జీవితాంతం తలవంచి నమస్కరిస్తాను” అని పేర్కొన్నారు.
షూటింగ్ మొదటి రోజు అనుభవాలను పంచుకుంటూ నాని అందించిన సపోర్ట్‌ను కొనియాడారు. “మొదటి రోజే నా చేతిలో బీడీ పెట్టి, నాని అన్న ఎదురుగా క్యారమ్ బోర్డ్ ఆడే సీన్ తీశారు. నాని లాంటి స్టార్ యాక్టర్ ముందు నటన రాక ఒకటికి పది టేకులు తీసుకున్నాను. నా పని అయిపోయింది, నన్ను ఈ సినిమా నుంచి తీసేస్తారేమోనని విపరీతంగా భయపడ్డాను. ‘మాలిక్ ఎక్కడ?’ అనే డైలాగ్ డెలివరీలో నేను తీవ్రంగా కన్‌ఫ్యూజ్ అయ్యాను. ఆ సమయంలో నాని అన్న దగ్గరుండి.. ‘సంపూ కూల్.. టెన్షన్ పడొద్దు’ అని ఓపిగ్గా నేర్పించి నాతో ఆ సీన్ చేయించారు. నాని అన్న పక్కన నటించడమే నా లైఫ్‌లో బిగ్గెస్ట్ అచీవ్‌మెంట్” అని వివరించారు.
‘ది ప్యారడైజ్’ విడుదలైన తర్వాతే మళ్లీ తన ఫోన్ నిరంతరం మోగుతోందని, ప్రేక్షకులు తన నటనను ఇంతలా ఓన్ చేసుకుంటారని అస్సలు ఊహించలేదని సంపూ ఆనంద భాష్పాలు రాల్చారు. ఒక నటుడిగా సంపూర్ణేష్ బాబు పడిన ఆవేదన, తిరిగి దక్కిన ఈ గుర్తింపుపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.













