
Mohan Babu: నేచురల్ స్టార్ నాని, డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ సినిమా మీడియా ములాఖత్‌తో వేదికగా డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సంచలనం రేపుతున్నాయి. ఈ సినిమాలో తాను భాగమైన వైనాన్ని వివరిస్తూ, మొదట్లో తన ఈగో ఎలా దెబ్బతిందో మోహన్ బాబు బహిరంగంగా వెల్లడించి అందరినీ షాక్‌కు గురిచేశారు.
కథ చెప్పడానికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల వచ్చినప్పటి పరిస్థితిని మోహన్ బాబు తనదైన శైలిలో గుర్తుచేసుకున్నారు. “శ్రీకాంత్ నా దగ్గరకు వచ్చి కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఈ సినిమాకి హీరో నాని కదా.. అతన్ని అడిగావా అని నేను ప్రశ్నించాను. దానికి శ్రీకాంత్ ‘మా అన్న పర్మిషన్ తీసుకునే మీ దగ్గరికి వచ్చాను’ అన్నాడు. అంతే.. ఆ మాట వినగానే నాకు ఒక్కసారిగా ఈగో కొట్టింది! ఏంటి.. నన్ను సినిమాలో పెట్టుకోవడానికి నాని రికమండేషన్ ఇస్తూ పర్మిషన్ ఇచ్చి పంపించాడా? అని మనసులో తీవ్రంగా అనిపించింది” అంటూ మోహన్ బాబు చేసిన ఓపెన్ కామెంట్స్ సభలో ఉన్నవారినే కాక సినీ వర్గాలను సైతం విస్మయానికి గురిచేశాయి. అయితే, నేటితరం కుర్రాడైనప్పటికీ ముఖం మీదే అంత ధైర్యంగా ఆ మాట చెప్పినందుకు శ్రీకాంత్‌ను, అలాగే నానిని ఆ తర్వాత అభినందించినట్లు తెలిపారు.
తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎన్నో పాత్రలు చేశానని, కానీ ‘ది ప్యారడైజ్’లో చేసిన పాత్ర అత్యంత క్రూరమైనదని మోహన్ బాబు పేర్కొన్నారు. “దాదాపు 55 ఏళ్ల సినీ జీవితంలో 500కు పైగా చిత్రాలు చేశాను. అందులో ఎన్నో విలన్ రోల్స్ కూడా పోషించాను. కానీ నా జీవితంలో ఇంత భయంకరమైన పాత్రను ఎప్పుడూ చేయలేదు. నన్ను ఇంత క్రూరంగా చూపిస్తాడని ముందుగా తెలిసుంటే కచ్చితంగా ఈ సినిమా ఒప్పుకునేవాడిని కాదు! కానీ ఒకసారి మాటిచ్చాక, సెట్‌కి వచ్చాక వెనక్కి తగ్గకూడదని భరించి చేశాను” అని చెప్పుకొచ్చారు. డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల టేకుల మీద టేకులు తీసుకుంటూ తనను విపరీతంగా ఇబ్బంది పెట్టాడని మోహన్ బాబు చెప్పారు. “నా కెరీర్లోనే నాతో అత్యధిక టేకులు తీసుకున్న ఏకైక దర్శకుడు శ్రీకాంత్ మాత్రమే. కళ్లు పెద్దవి చేయ్.. కోపం రప్పించు.. పళ్ళు కొరుకు అంటూ ప్రతి చిన్న ఎక్స్‌ప్రెషన్‌కి పది టేకులు తీసుకుని చంపేశాడు. ఒకానొక దశలో వీడేంటిరా బాబు నాతో ఇన్ని టేకులు తీస్తున్నాడు అనిపించింది. మా గురువు దాసరి నారాయణరావు గారు నాతో ఎక్కువ టేకులు తీసేవారు. ఎంత లోతుకు తవ్వితే అంత నీళ్లు వస్తాయని ఆయన చెప్పేవారు. శ్రీకాంత్ కూడా నాలోని ప్రతిభను పూర్తిగా పిండేసి, ‘శికంజా మాలిక్’ పాత్రను ప్రాణం పెట్టి తెరకెక్కించాడు” అంటూ దర్శకుడి డెడికేషన్‌ను కొనియాడారు.
ఈ వయసులో కూడా తనతో బేర్ బాడీ ఫైట్ చేయించాడని మోహన్ బాబు వెల్లడించారు. తన సినీ జీవితంలో బేర్ బాడీతో ఫైట్ చేయడం కేవలం మూడు సినిమాల్లోనే జరిగిందని, అందులో దాసరి గారి సినిమా, ‘రాయలసీమ రామన్న చౌదరి’ తర్వాత మూడో చిత్రం ఇదేనని తెలిపారు. దీనికోసం పొద్దున, సాయంత్రం కసరత్తులు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అలాగే నాని పడిన కష్టాన్ని ప్రస్తావిస్తూ.. “ఆ జడలు వేసుకుని నాని ఎంత నరకం అనుభవించాడో నాకు తెలుసు. ఫైట్ సీన్లో ఆ జడలు పట్టుకుని పైకి లేపి కొట్టినప్పుడు నాని పడ్డ బాధను స్వయంగా చూశాను. నాని నిజంగానే గ్రేట్ యాక్టర్, ఆల్ రౌండర్” అంటూ ప్రశంసల జల్లు కురిపించారు. మొత్తానికి, ‘ది ప్యారడైజ్’ వేదికపై మోహన్ బాబు చేసిన ఈ బోల్డ్ కామెంట్స్, నాని పర్మిషన్ ప్రస్తావన, తన పాత్ర తాలూకు భీకరత్వాన్ని వివరించిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది.













