MM Keeravani: “ఇక్కడికి వచ్చింది జల విద్యుత్ కేంద్రం కాదు.. నట విద్యుత్ కేంద్రం” కీరవాణి

MM Keeravani

MM Keeravani: ఆస్కార్ విజేత, సంగీత దిగ్గజం ఎం.ఎం.కీరవాణి మాట్లాడితే అందులో చమత్కారంతో పాటు ఆలోచింపజేసే గంభీరత ఉంటుంది. ఎస్.ఎస్. కార్తికేయ నిర్మాతగా, మలయాళ వర్సటైల్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ హీరోగా తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో కీరవాణి స్పీచ్ ఆద్యంతం సభికులను కేరింతలు కొట్టించింది. ముఖ్య అతిథిగా వచ్చిన జూనియర్ ఎన్టీఆర్‌ను ఉద్దేశించి ఆయన చేసిన “నట విద్యుత్ కేంద్రం” కామెంట్, నందమూరి అభిమానులతో చెప్పించిన మూడు మంత్రాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

వేదికపై ఉన్న తారక్‌ను చూపిస్తూ కీరవాణి చేసిన కామెంట్స్ ఫ్యాన్స్‌కు గూస్‌బంప్స్ తెప్పించాయి. “మా అబ్బాయి కాలభైరవ నుంచి నాగవంశీ గారి వరకు అందరూ మీతో ఒకటే నినాదం చేయించారు.. అదే ‘జై ఎన్టీఆర్’. కానీ నేను ఆ మాట చెప్పించే ముందు ఒక చిన్న విషయం చెప్పాలి. ఇక్కడికి వచ్చింది ఏదో సాధారణ జల విద్యుత్ కేంద్రం కాదు.. ఇది సాక్షాత్తూ ‘నట విద్యుత్ కేంద్రం’. ఆ నట విద్యుత్ కేంద్రం నుంచి అసలైన ఎనర్జీని బయటకు లాగాలంటే కేవలం ఒక్క మంత్రం చెబితే సరిపోదు.. ఏకంగా మూడు మంత్రాలు కావాలి” అంటూ కీరవాణి ఇచ్చిన ఎలివేషన్‌కు ఆడిటోరియం మొత్తం మార్మోగిపోయింది.

ఈ చిత్ర ట్రైలర్‌కు నటసింహం నందమూరి బాలకృష్ణ వాయిస్ ఓవర్ అందించిన సంగతిని గుర్తుచేస్తూ కీరవాణి ఆడియన్స్‌తో కలిసి నినదించారు. “ఈ సినిమా ట్రైలర్‌కు వాయిస్ ఇచ్చిన బాలయ్య గారి సాక్షిగా మనకి ఇప్పుడు మూడు మంత్రాలు కావాలి. ఆ మూడింటినీ మీతో చెప్పిస్తే నేను ఇక్కడికి వచ్చిన పని పూర్తయినట్టే.. అందరూ రెడీగా ఉండండి” అంటూ.. “జై బాలయ్య.. జై ఎన్టీఆర్.. డోంట్ ట్రబుల్ ది ట్రబుల్!” అని గట్టిగా నినదించి ఆ ప్రాంగణాన్ని హోరెత్తించారు. ఈ మూడు పేర్లనూ గుర్తుపెట్టుకుని అందరూ అక్టోబర్ 2న థియేటర్లకు రావాలని కోరారు.

సినిమా యూనిట్‌ను ఆశీర్వదిస్తూ కీరవాణి తనదైన శైలిలో మాట్లాడారు. “దర్శకుడు శశాంక్ తన గురువు చంద్రశేఖర్ ఏలేటిని మించిన శిష్యుడిగా ఎదగాలి. నా కొడుకు కాలభైరవ అందించిన బ్యాక్‌‌గ్రౌండ్ స్కోర్‌కు మంచి గుర్తింపు దక్కాలి. నా ఫేవరెట్ యాక్టర్ ఫహద్ ఫాజిల్ గారు పూర్తిస్థాయిలో తెలుగు తెరపైకి అడుగుపెడుతున్న ఈ చిత్రం తిరుగులేని సూపర్ హిట్ కావాలి. చైల్డ్ ఆర్టిస్ట్ సారాకు మంచి పేరు రావాలి. అలాగే నా మరో అబ్బాయి కార్తికేయ ‘షోయింగ్ బిజినెస్’ బ్యానర్‌పై మొదటిసారి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకోవాలి. ఇన్ని కోరికలు నిజం కావాలని కోరుకుంటున్నానంటే ఇదంతా నా స్వార్థమే”
అని నవ్వులు పూయించారు. చివరగా ఎన్టీఆర్-రాజమౌళి కాంబినేషన్‌లో వచ్చి తన సంగీతంతో ప్రభావితం చేసిన క్లాసిక్ ‘స్టూడెంట్ నెం.1’ చిత్రం 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేదికపై ఉన్న ప్రతి ఒక్కరికీ కీరవాణి శుభాకాంక్షలు తెలిపారు.