Arjun Sarja : అయోధ్యలో అర్జున్ సర్జా కొత్త సినిమా ప్రారంభం.. నవంబర్ 27న టైటిల్ అనౌన్స్‌మెంట్!


యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా మరో ప్రతిష్ఠాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తూ, స్వయంగా దర్శకత్వం వహించనున్న ఈ భారీ బడ్జెట్ దేశభక్తి చిత్రాన్ని ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై అనూప్ మోహన్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నవంబర్ 27న అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిలో నిర్వహించనున్నారు. అదే రోజున సినిమా టైటిల్‌ను కూడా అధికారికంగా ప్రకటించేందుకు చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో పలు భాషల్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాలో బాలీవుడ్‌తో పాటు వివిధ ప్రాంతీయ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు. రిటైర్డ్ ఆర్మీ అధికారి మేజర్ విజయ్ భార్గవన్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, జోస్ ఎం. థామస్ రాయ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించనున్నారు. దేశభక్తి, ధైర్యసాహసాలు, త్యాగం, భారతదేశ గొప్పతనాన్ని ప్రతిబింబించేలా అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో ఈ సినిమాను రూపొందించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ప్రెసిడెన్షియల్ మూవీస్ ఇంటర్నేషనల్ బ్యానర్‌లో తెరకెక్కుతున్న మూడో ప్రతిష్ఠాత్మక చిత్రంగా ఇది నిలవనుంది.