
బాల్యంలోని మధురమైన జ్ఞాపకాలను గుర్తు చేస్తూ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్న నోస్టాల్జిక్ చిత్రం ‘సమ్మర్ హాలిడేస్’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ సినిమా డిసెంబర్ 4 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ సోనీ లివ్ (Sony LIV) లో స్ట్రీమింగ్ కానుంది. వేసవి సెలవులు, స్నేహితులతో ఆటపాటలు, అమ్మమ్మ ఇంటి అనుబంధాలు, పల్లెటూరి వాతావరణం వంటి అందమైన జ్ఞాపకాలను మరోసారి కళ్లముందు నిలిపేలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దర్శకుడు శ్రీకర్ నాయన్ తొలి ప్రయత్నంలోనే బాల్యంలోని అమాయకత్వాన్ని, స్నేహంలోని మాధుర్యాన్ని హృద్యంగా ఆవిష్కరించారు.
గోదావరి ప్రాంతంలోని ఓ అందమైన పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ కథలో హైదరాబాద్కు చెందిన ఆర్.వి (అరుణ్ దేవ్) వేసవి సెలవుల కోసం అమ్మమ్మ (జయసుధ) ఇంటికి వెళ్తాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులతో జీవించే కె.వి (రోహన్ రాయ్) అనే బాలుడితో అతనికి స్నేహం ఏర్పడుతుంది. భిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన ఈ ఇద్దరు పిల్లల మధ్య మొదలైన స్నేహం ఎన్నో అనుభవాలకు, సరదాలకు, జీవిత పాఠాలకు దారితీస్తుంది. ఈ చిత్రంలో రోహన్ రాయ్, అరుణ్ దేవ్, ఖుషీతో పాటు జయసుధ, వాసుకి ఆనంద్, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ధీరజ్ మొగిలినేని, గిరి బాబు వల్లభనేని నిర్మించిన ఈ సినిమా కుటుంబమంతా కలిసి చూసేలా రూపొందింది. ముఖ్యంగా చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకోవాలనుకునే వారికి ‘సమ్మర్ హాలిడేస్’ మంచి అనుభూతిని అందించనుంది.














