Chandrababu : చంద్రబాబు-అమిత్ షా భేటీ.. పోలవరం లింక్ ప్రాజెక్ట్, ఆర్ధిక సాయం కీలక అంశాలు

Chandrababu
Chandrababu : ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరింత బిజీగా రాజకీయ, అభివృద్ధి అంశాలపై చర్చలు జరుపుతున్నారు. తాజాగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగినట్లు సమాచారం.

మాజీ కేంద్ర మంత్రి, టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజును గవర్నర్‌గా నియమించినందుకు కేంద్రం, ప్రధానమంత్రి మోడీ, హోం మంత్రి అమిత్ షాలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు చంద్రబాబు. రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు, అభివృద్ధి కార్యక్రమాలపై కూడా ఈ సందర్భంగా ఆయన హోం మంత్రి అమిత్ షాతో సమాలోచనలు చేశారు.

ప్రస్తుతం ఏపీ తీవ్ర ఆర్ధిక కష్టాల్లో ఉందని, కేంద్రం సహకారం వల్లే ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టగలుగుతున్నామని తెలిపారు సీఎం చంద్రబాబు. అయితే ఇంకా నిధుల కొరత తీరలేదని పేర్కొంటూ, మరింత సహాయం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర విభజన వల్ల జరిగిన ఆర్ధిక నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని, 16వ ఆర్థిక సంఘానికి ఈ విషయాన్ని నివేదించినట్లు అమిత్ షాకు వివరించారు.

ఇక ముఖ్యంగా గోదావరి మిగులు జలాలను వినియోగించేందుకు ప్రతిపాదించిన పోలవరం–బనకచర్ల లింక్ ప్రాజెక్ట్ (BPLP)పై చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ ప్రాజెక్టు ద్వారా రూ.81,900 కోట్ల వ్యయంతో గోదావరి నుంచి కర్నూలు జిల్లా బనకచర్ల వరకూ 200 టీఎంసీల వరద నీరు తరలించే అవకాశముందని చెప్పారు. గోదావరిలో ఎగువ రాష్ట్రాల అవసరాలు తీర్చిన తర్వాత సుమారు 90 నుంచి 120 రోజుల పాటు మిగిలే నీటిని ఏపీ పూర్తిగా వినియోగించే హక్కు కలిగి ఉందని స్పష్టం చేశారు.

ఈ లింక్ ప్రాజెక్టు రాష్ట్రంలోని కరవు ప్రాంతాలకు భారీ ఊతమిస్తుందని, దీని అమలుకు కేంద్రం అంగీకరిస్తే, ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయం, తాగునీరు, పరిశ్రమల అభివృద్ధిలో మెరుగైన అవకాశాలు లభిస్తాయని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.