Tirupati : తిరుమలలో చిరుత మరొకసారి కలకలం రేపింది. ఈస్ట్ బాలాజీ నగర్ సమీపంలోని బాల గంగమ్మ ఆలయంలోకి సోమవారం రాత్రి చిరుత ప్రవేశించింది. ఆలయ ఆవరణలోని విగ్రహాల వద్దకు చేరుకున్న ఆ చిరుత, అక్కడ ఉన్న ఓ పిల్లిపై దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈ ఘటన ఆలయంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డు అయింది. ఫుటేజ్‌లో చిరుత కదలికలను గమనించిన ఆలయ సిబ్బంది వెంటనే అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న వెంటనే అటవీశాఖ అధికారులు ఈ రోజు ఉదయం ఆలయం వద్దకు చేరుకుని పరిసర ప్రాంతాలను పరిశీలించారు. చిరుత కదలికల నేపథ్యంలో భక్తులు మరియు సమీప ప్రాంత నివాసితులు అప్రమత్తంగా ఉండాలని వారు హెచ్చరించారు. భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేసినట్లు అధికారులు తెలిపారు.










