Tragedy : బీహార్ రాష్ట్రంలోని పూర్ణియా జిల్లాలో ఒక దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి పరారవ్వాలనే ఆలోచనతో, కన్న కొడుకు కళ్లముందే తన భర్తను హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం, పూర్ణియా జిల్లా వాసి బాలో దాస్ (45) పంజాబ్లో కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అతని భార్య ఉషా దేవి ముగ్గురు పిల్లలతో సొంతూర్లో ఉండేది. అయితే ఈ క్రమంలో గ్రామంలో ఉన్న ఓ యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆ ప్రియుడితో కలిసి జీవితాన్ని గడిపేందుకు ఉషా దేవి నిర్ణయం తీసుకుంది.
ఈ ప్లాన్లో భాగంగా భర్తకు తెలియకుండా ఇంటి స్థలాన్ని అమ్మేసి, ఆ డబ్బుతో ప్రియుడితో పారిపోయేందుకు సిద్ధమైంది. అయితే భూమి అమ్మిన విషయం తెలిసిన బాలో దాస్ వెంటనే ఊరుకు వచ్చేశాడు. దీంతో ఆమె కుట్ర ముందుకు సాగలేదు. భర్త నిలదీయడం, ప్రియుడిని కలవలేకపోవడం వల్ల ఉషా దేవి కిరాతక నిర్ణయం తీసుకుంది.
ఆదివారం రాత్రి భర్త నిద్రలో ఉండగా గడ్డి కోసే కత్తితో అతని గొంతు కోసింది. పక్కన పడుకున్న పన్నెండేళ్ల కొడుకు తండ్రి రక్తం తన ముఖంపై పడడంతో మేల్కొని చూశాడు. తల్లే తన తండ్రిని హత్య చేస్తున్న దృశ్యం చూసి దిగ్భ్రాంతి చెందిన బాలుడు కేకలు వేసేందుకు ప్రయత్నించగా, తల్లి అతన్ని బెదిరించింది. “నోరు తెరిస్తే నిన్నూ చంపేస్తా” అంటూ హెచ్చరించింది. దీంతో బాలుడు భయంతో వణికి తెల్లవారుజాము వరకు మౌనంగా ఉండిపోయాడు.
మరుసటి రోజు బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన దారుణాన్ని వివరించడంతో విషయమంతా బయటపడింది. బంధువులు, గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించగా, పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని ఉషా దేవిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె ప్రియుడితో పారిపోవాలనే ఉద్దేశంతోనే భర్తను హత్య చేసినట్టు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతున్నట్లు తెలిపారు.










