
The Paradise: సినిమా రిలీజ్‌కు ముందే బాక్సాఫీస్ లెక్కలను తిరగరాయడం కొందరికే సాధ్యం. ప్రస్తుతం న్యాచురల్ స్టార్ నాని ఆ మ్యాజిక్‌నే రిపీట్ చేస్తున్నారు. ‘దసరా’ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో కలిసి ఆయన తీసుకొస్తున్న రా అండ్ రస్టిక్ ట్రైబల్ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. సెన్సార్ బోర్డు నుంచి ఈ చిత్రానికి ‘ఎ’ (A) సర్టిఫికెట్ రావడంతో వెండితెరపై వయొలెన్స్, ఎమోషన్స్ ఏ రేంజ్లో ఉండబోతున్నాయోనన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. అయితే విడుదల కాకముందే ఈ సినిమా సృష్టిస్తున్న ప్రీ-సేల్స్ విధ్వంసం ఇప్పుడు ట్రేడ్ వర్గాలనే విస్మయానికి గురిచేస్తోంది.
నార్త్ అమెరికాలో నాని మార్కెట్ స్టామినా మరోసారి విశ్వరూపం చూపిస్తోంది. ప్రీమియర్లకు ముందే అక్కడ సరికొత్త బెంచ్‌మార్క్ క్రియేట్ అయ్యింది. దాదాపు 505 లొకేషన్లలో అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా, క్షణాల్లో 24,255 టికెట్లు అమ్ముడైపోయాయి. కేవలం టికెట్ల అమ్మకాల ద్వారానే $561,967 వసూలు చేసి, మొత్తం ప్రీ-సేల్స్ కలెక్షన్లలో ఏకంగా $610,000 డాలర్ల మార్కును అలవోకగా దాటేసింది. ఓ భారతీయ సినిమాకు రిలీజ్‌కు ముందే ఈ స్థాయిలో రెస్పాన్స్ రావడం ఓవర్సీస్లో నాని క్రేజ్‌కు నిదర్శనం అని చెబుతున్నారు.
ఓవర్సీస్లోనే కాదు, సొంత గడ్డపై కూడా బుకింగ్స్ వేగం ఏమాత్రం తగ్గడం లేదు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైన తొలిరోజే ₹1.4 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి తన జోరును చాటుకుంది. బుక్‌మైషో వంటి టికెటింగ్ ప్లాట్‌ఫామ్‌లలో టికెట్ల కోసం ప్రేక్షకులు పోటీపడుతుండటంతో థియేటర్ల దగ్గర సందడి మొదలైపోయింది. కలక్షన్ల ఊపుకి తోడు చిత్ర బృందం చేపట్టిన ‘జడల్ జమానా షురూ’ ప్రమోషనల్ క్యాంపెయిన్, ఫ్యాన్ మీట్స్‌కు అనూహ్య స్పందన దక్కింది. అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం, మోహన్ బాబు, రాఘవ్ జుయల్, కాయాడు లోహార్ లాంటి బలమైన తారాగణం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను తారాస్థాయికి చేర్చాయి. పక్కా యాక్షన్ కంటెంట్‌తో వస్తున్న ‘ది ప్యారడైజ్’ బాక్సాఫీస్ వద్ద ఇంకెన్ని రికార్డులను బద్దలు కొడుతుందో చూడాలి.














