
సూపర్‌స్టార్ మహేశ్ బాబు కుటుంబంలో పెళ్లి సందడి నెలకొంది. మహేశ్ బాబు మేనల్లుడు, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ రెండో కుమారుడు సిద్ధార్థ్ గల్లా ఓ ఇంటివాడయ్యాడు. దక్షిణ కొరియాకు చెందిన తన ప్రేయసి హైన్ కిమ్‌ను ఆయన వివాహం చేసుకున్నాడు. ఇటీవలే నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట తాజాగా వివాహ బంధంతో ఒక్కటైంది. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలను మహేశ్ బాబు సోదరి మంజుల ఘట్టమనేని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. ఘట్టమనేని, గల్లా కుటుంబ సభ్యులతో పాటు వధువు తరఫు బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగినట్లు తెలుస్తోంది.
విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఈ వివాహ వేడుక జరిగినట్లు సమాచారం. పెళ్లి ఫొటోల్లో సిద్ధార్థ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, హైన్ కిమ్ ఎరుపు రంగు పట్టుచీరలో ఆకట్టుకున్నారు. అయితే ఈ పెళ్లి ఫొటోల్లో మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రత కనిపించకపోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. సిద్ధార్థ్ గల్లా, హైన్ కిమ్‌లకు సోషల్ మీడియా వేదికగా పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా, గల్లా జయదేవ్, పద్మావతి దంపతుల పెద్ద కుమారుడు అశోక్ గల్లా ఇప్పటికే నటుడిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. చిన్న కుమారుడైన సిద్ధార్థ్ మాత్రం సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ వ్యాపార వ్యవహారాలు చూసుకుంటున్నారు.













