Jagapathi Babu: ‘నిజజీవితంలో నటించాల్సిన అవసరం నాకు లేదు’: జగపతి బాబు

Jagapathi Babu

Jagapathi Babu: సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ నటిస్తూ బతకాల్సిన అవసరం తనకు లేదని ప్రముఖ నటుడు జగపతి బాబు స్పష్టం చేశారు. అందుకే ఏదైనా ఉన్నది ఉన్నట్లు నిర్మొహమాటంగా మాట్లాడటం అలవాటు చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఇటీవల విడుదలైన ‘పెద్ది’ సినిమాలో అప్పలసూరి పాత్రతో ప్రేక్షకులను మెప్పించిన ఆయన, ప్రస్తుతం వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నా జీవితంలో పశ్చాత్తాపం లేదు
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకప్పుడు ఫ్యామిలీ ఆడియన్స్ వల్లే తనకు స్టార్‌డమ్ వచ్చిందని, ఇప్పుడు అందరు హీరోలతో కలిసి నటిస్తుండటంతో అందరూ ఆదరిస్తున్నారని సంతోషం వ్యక్తం చేశారు. “నా కెరీర్‌, జీవితంలో ఏ విషయంలోనూ నాకు పశ్చాత్తాపం లేదు. కోల్పోయిన దాని గురించి నేను ఎప్పుడూ ఆలోచించను. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన మనకో పాఠాన్ని నేర్పుతుంది” అని ఆయన పేర్కొన్నారు. అబద్ధాలు ఆడటంపై ఆయన స్పందిస్తూ.. “నేను జీవితంలో ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు అని ఎవరైనా అంటే, అదే అన్నిటికంటే పెద్ద అబద్ధం” అని అన్నారు. నిజం చెప్పి కూడా ధైర్యంగా బతకొచ్చని అర్థమయ్యాక, తాను దేనికీ వెనకాడకుండా నిర్మొహమాటంగా మాట్లాడటం మొదలుపెట్టానని వెల్లడించారు. అనవసరంగా నిజాలు దాస్తూ, ప్రతిదానికీ అబద్ధాలు చెప్తూ నిజజీవితంలో నటించాల్సిన అవసరం తనకు లేదన్నారు.

Also Read :  Ram Charan Devalayam: గుడి కట్టే రేంజ్‌లో రామ్ చరణ్ క్రేజ్.. కూకట్‌పల్లిలో మెగా అభిమానుల అరాచకం.. ఏం జరిగిందంటే?

ట్రోల్స్‌పై జగపతి బాబు రియాక్షన్ ఇదే..
నెటిజన్లు తనను ట్రోల్ చేయడానికి చాలా అవకాశాలు వచ్చినా, మిగతా వారితో పోలిస్తే తనను తక్కువగానే ట్రోల్ చేశారని ఆయన అన్నారు. గతంలో తాను చనిపోయినట్లు, పక్కన ఎన్టీఆర్ ఏడుస్తున్నట్లు వ్యూస్ కోసం కొన్ని తప్పుడు వీడియోలు క్రియేట్ చేశారని గుర్తుచేసుకున్నారు. “అలాంటి ఫేక్ వార్తలను నేను అస్సలు పట్టించుకోను. పనిలేని వాళ్లు చేసే పనులవి, వాటికి స్పందించాల్సిన అవసరం లేదు” అని అన్నారు. “ప్రస్తుతం నా జీవితాన్ని నాకు నచ్చినట్లు బతుకుతూ పూర్తిగా ఆస్వాదిస్తున్నాను” అని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.