
Meera Vasudevan: తెలుగులో ‘గోల్మాల్’, ‘గోల్కొండ హైస్కూల్’ వంటి చిత్రాలతో పాటు మలయాళ, తమిళ పరిశ్రమల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న సీనియర్ నటి మీరా వాసుదేవన్. తాజాగా ఆమె తన వ్యక్తిగత జీవితంపై చేసిన సంచలన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. తన వైవాహిక జీవితంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను, చేసిన తప్పులను ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.
తాను జీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకుని దాదాపు 17 సంవత్సరాల విలువైన కాలాన్ని వృధా చేసుకున్నానని మీరా వాసుదేవన్ ఆవేదన వ్యక్తం చేశారు. “జీవితంలో తోడు కావాలని తొందరపడి నిర్ణయాలు తీసుకున్నాను. కానీ ఆ మూడు బంధాలు నాకు మానసిక క్షోభను, చేదు అనుభవాలనే మిగిల్చాయి. నా జీవితంలో ఆ 17 ఏళ్లు పూర్తిగా వేస్ట్ అయిపోయాయి. ఇప్పుడు నాకు పూర్తిగా బుద్దొచ్చింది” అంటూ ఆమె సంచలన కామెంట్స్ చేశారు.
గత చేదు జ్ఞాపకాలను వెనక్కి నెట్టి, ప్రస్తుతం తన దృష్టినంతా కెరీర్, తన కొడుకు భవిష్యత్తుపైనే పెట్టినట్లు మీరా తెలిపారు. ఒంటరిగా ఉన్నా ప్రశాంతంగా, గౌరవంగా బతకవచ్చనే విషయాన్ని ఆలస్యంగా గ్రహించానని, ప్రస్తుతం తన జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారు. మీరా వాసుదేవన్ 2005లో విశాల్ అగర్వాల్‌ను, ఆ తర్వాత 2012లో నటుడు జాన్ కొక్కెన్‌ను వివాహం చేసుకుని విడిపోయారు. అనంతరం మూడో వివాహం కూడా విఫలం కావడంతో ప్రస్తుతం ఆమె ఒంటరిగానే ఉంటున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.









