‘Tholisari Mimmalni Choosindi Modalu’: హీరో భార్గవ్ డైరెక్టర్‌గా మారాడు.. పూజా కార్యక్రమాలతో కొత్త సినిమా స్టార్ట్

Bhargav

‘Tholisari Mimmalni Choosindi Modalu’: కన్నడ చిత్ర పరిశ్రమలో ‘సుప్రీమ్ స్టార్’గా గుర్తింపు తెచ్చుకున్న భార్గవ్ హీరోగా, దర్శకుడిగా తెరకెక్కిస్తున్న కొత్త సినిమా ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’. మీనాక్షి జైస్వాల్, ఆరియా మీనన్ కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో రూపొందిస్తున్నారు. కొసల క్రియేటివ్ వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్‌పై బండి నాగరాజు నిర్మిస్తుండగా.. మద్దినేని రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఈ సినిమా పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇవ్వగా.. ఫిలిం ఛాంబర్ సెక్రటరీ కె. అశోక్ కుమార్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. దర్శకుడు దశరథ్ తొలి షాట్‌కు గౌరవ దర్శకత్వం వహించగా.. దర్శకుడు వీరశంకర్ స్క్రిప్ట్ అందించారు. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ చిత్రాన్ని విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఎమోషనల్ థ్రిల్లర్‌గా తెరకెక్కిస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. సెప్టెంబర్ మొదటి వారంలో బెంగళూరులోని ఓ గ్రామంలో షూటింగ్ ప్రారంభించనున్నట్లు నిర్మాత బండి నాగరాజు తెలిపారు. రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేసి అక్టోబర్ నాటికి సినిమాను విడుదలకు సిద్ధం చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరులో షూటింగ్ జరగనుంది.

ఈ సందర్భంగా హీరో, దర్శకుడు భార్గవ్ మాట్లాడుతూ.. ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’ పాటలో ఉన్న ఫీల్, వైబ్ సినిమాలోనూ ఉంటుందని చెప్పారు. ఈ చిత్రంతో తెలుగులో తన కెరీర్‌ను ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. సినిమా పట్ల నిర్మాత బండి నాగరాజుకు ఉన్న ప్యాషన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ మద్దినేని రమేష్ అందిస్తున్న సహకారాన్ని ప్రశంసించారు. మరోవైపు సినిమాలో ఎడ్జ్ ఆఫ్ ది సీట్ సన్నివేశాలతో పాటు ప్రేక్షకులు సీట్లలో నుంచి లేచి డ్యాన్స్ చేసేలా ఓ స్పెషల్ ఐటెం సాంగ్ కూడా ఉంటుందని భార్గవ్ తెలిపారు. సంగీత దర్శకుడు పెద్దపల్లి రోహిత్ ఈ చిత్రానికి నాలుగు పాటలను సిద్ధం చేసినట్లు చెప్పారు. మంచి కథ, కథనాలతో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంగీతం కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది. కాగా, ఈ సినిమాలో కాదంబరి కిరణ్, కిల్లి క్రాంతి, అనంత ప్రభు, టేస్టీ తేజ, సాయి కిషోర్, నితిన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. విలేజ్ బ్యాక్‌డ్రాప్, లవ్, ఎమోషన్, థ్రిల్ అంశాల కలయికతో రూపొందుతున్న ‘తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు’పై సినిమా ప్రారంభం నుంచే ఆసక్తి నెలకొంది.