
Dora Sai Teja: వర్టికల్ స్టోరీస్‌లోని చాయ్ షాట్స్ నుంచి వచ్చిన ‘దందా’ సిరీస్‌తో హీరోగా దొర సాయి తేజ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దర్శకుడు ఆదిత్య దేవులపల్లి తెరకెక్కించిన ఈ సిరీస్ ప్రస్తుతం యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇందులో అరవింద్ పాత్రలో దొర సాయి తేజ నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సందర్భంగా తన సినీ ప్రయాణం, కంటెంట్ క్రియేషన్, సోషల్ మీడియా, ‘దందా’ సక్సెస్, భవిష్యత్ లక్ష్యాల గురించి ఆయన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభాస్ నటించిన ‘అడవి రాముడు’ సినిమాలో హీరో చిన్ననాటి పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు తెలిపారు. ‘కొత్త బంగారులోకం’, ‘హై స్కూల్’ వంటి సిరీస్‌లలో నటించానని, ‘అలా మొదలైంది’ సినిమాలోనూ చిన్న పాత్ర చేశానని చెప్పారు. 2016లో రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడిందని, ‘శ్రీదేవి’ అనే విడుదల కాని సినిమాలో నటించినట్లు వెల్లడించారు. 2018లో తన యూట్యూబ్ ప్రయాణాన్ని సీరియస్‌గా ప్రారంభించానని, ‘బ్యాక్ బెంచర్స్’ సిరీస్‌తో మంచి గుర్తింపు వచ్చిందని తెలిపారు. అనంతరం పలు సిరీస్‌లు చేస్తూ వచ్చానని, గత ఏడాది సొంతంగా కంటెంట్ క్రియేషన్ కంపెనీని ప్రారంభించానని చెప్పారు. తాజాగా ‘దందా’తో మరోసారి విజయాన్ని అందుకున్నానని వెల్లడించారు.
తాను ఒకేసారి కంటెంట్ క్రియేటర్‌గా, దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా ఆలోచిస్తుంటానని దొర సాయి తేజ తెలిపారు. తనను తాను కొత్తగా పరిచయం చేసుకోవడానికి వివిధ రంగాల్లో ప్రయత్నిస్తున్నానని చెప్పారు. “కంటెంట్ క్రియేషన్ అనేది నా బిజినెస్. సినిమా అనేది నా ప్యాషన్. ఈ రెండింటినీ కలిపితే దొర సాయి తేజ” అని ఆయన పేర్కొన్నారు. తనకు పార్టీలు, ఎంజాయ్మెంట్ కంటే కొత్త విషయాలు నేర్చుకోవడంపైనే ఆసక్తి ఎక్కువని తెలిపారు. తాను చేసిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటానని, తన వయసు కంటే దాదాపు ఐదేళ్లు పెద్దవాడిలా ఆలోచిస్తానని చెప్పారు. ‘దందా’లో అరవింద్ పాత్రకు వస్తున్న స్పందనపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు. కంటెంట్ క్రియేషన్స్‌లో ఒకే తరహా పాత్రలు చేసే అవకాశం ఉంటుందని, కానీ సిరీస్, సినిమాల్లో మాత్రం విభిన్నమైన పాత్రలు చేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. ఇన్నాళ్లుగా సవాల్‌తో కూడిన పాత్రలు చేయాలని ఎదురుచూశానని, ‘దందా’లో అరవింద్ పాత్ర అలాంటి అవకాశాన్ని ఇచ్చిందని తెలిపారు. ఈ పాత్ర తనకు రావడానికి దర్శకుడు ఆదిత్య దేవులపల్లి కారణమని పేర్కొన్నారు. ఈ సిరీస్ సక్సెస్‌కి కూడా ఆయనే ప్రధాన కారణమని వెల్లడించారు. పేపర్‌పై అనుకున్నదాన్ని అనుకున్నట్లుగా తెరపైకి తీసుకురావడం అంత సులభం కాదని, ఆ విషయంలో ఆదిత్య వంద శాతం సక్సెస్ అయ్యారని ప్రశంసించారు. ప్రేక్షకుల్లో స్ఫూర్తిని నింపే కథలు, మంచి సందేశాన్ని అందించే ప్రాజెక్టులు చేయాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. మన చుట్టూ కనిపించే వ్యక్తులు, కథలనే ఎంచుకుని సినిమాలు చేయాలనుకుంటున్నానని తెలిపారు.
ప్రస్తుతం సినిమా లేదా కంటెంట్ సక్సెస్ కావాలంటే మంచి మార్కెటింగ్ కూడా అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. “కంటెంట్ ఎంత బాగున్నా.. దాని గురించి ప్రేక్షకులకు చెప్పే సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ లేకపోతే వృథానే. అందుకే ప్రమోషన్స్, మార్కెటింగ్ చాలా కీలకం” అని అన్నారు. సోషల్ మీడియాలో తన కోసం నిలబడే అభిమానుల గురించి మాట్లాడుతూ.. ఈ ఫాలోయింగ్ ఒక్కరోజులో ఏర్పడలేదని అన్నారు. తాను చేసిన కంటెంట్‌లో ప్రేక్షకులు తమను తాము చూసుకున్నారని, అందుకే తనతో కనెక్ట్ అయ్యారని వెల్లడించారు. “ప్రేక్షకులు నా కోసం ఖర్చు చేసే డబ్బులకు న్యాయం చేయాలనే లక్ష్యంతో పని చేస్తాను” అని దొర సాయి తేజ తన భవిష్యత్ లక్ష్యాన్ని స్పష్టం చేశారు.
అన్నారు. సోషల్ మీడియాలో పాజిటివిటీతో పాటు నెగెటివిటీ కూడా ఉంటుందని, ఎవరు ఏం మాట్లాడినా తనకు నిజం ఏంటో తెలుసని, అందుకే వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతానని చెప్పారు. తాను కూడా అందరిలాంటి సాధారణ వ్యక్తినేనని, కాకపోతే తనకంటూ ఒక ప్రత్యేకమైన దారిని ఏర్పరుచుకున్నానని తెలిపారు. ఇకపై తనను ప్రేక్షకులు కొత్త కోణంలో చూస్తారని అన్నారు.











