Jr NTR: ఆ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదా? ‘డ్రాగన్’ రిలీజ్ డైలమాలో పడ్డట్టేనా!

Priyanka Chopra

Jr NTR: గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ ఆరోగ్యంపై మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. గతంలో ఆయన చేతికి బలమైన గాయం కావడం, అనంతరం సర్జరీ జరగడం తెలిసిన విషయమే. ఆ తర్వాత కొన్నాళ్లపాటు పబ్లిక్ ఈవెంట్లకు దూరంగా ఉన్న తారక్, తాజాగా జరిగిన ఓ వేడుకలో కనిపించిన తీరు అభిమానులను, సినీ వర్గాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. ఎన్టీఆర్ ఆ గాయం నుంచి ఇంకా పూర్తిగా కోలుకోలేదా? ఇప్పటికీ చికిత్స దశలోనే ఉన్నారా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో దావానలంలా వ్యాపిస్తున్నాయి.

ఫహద్ ఫాజిల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. చాలా రోజుల తర్వాత స్టేజ్ పైకి వచ్చిన తన అభిమాన హీరోను చూసి ఫ్యాన్స్ కేరింతలు కొట్టినా, అక్కడ ఆయన కదలికలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. సాధారణంగా అభిమానులకు అభివాదం చేసేటప్పుడు లేదా మాట్లాడేటప్పుడు కుడిచేతినే ఎక్కువగా వాడే ఎన్టీఆర్.. ఈ కార్యక్రమంలో మాత్రం పూర్తిగా ఎడమ చేతిపైనే ఆధారపడ్డారు. మైక్‌ను ఎడమ చేత్తోనే పట్టుకోవడమే కాకుండా, కుడిచేతిని అసలు పైకి ఎత్తకుండా చాలా జాగ్రత్తగా కదల్చకుండా ఉంచుకున్నారు. వేదికపై ఎవరితోనైనా మాట్లాడినా కుడిచేత్తో షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి కూడా ఆయన వెనకడుగు వేయడం స్పష్టంగా కనిపించింది.

దీనికి తోడు, ఇటీవల ఓ అభిమానిని తారక్ కలిసిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది. అందులో ఆయన కుడిచేతికి మెడికల్ సపోర్ట్ బెల్ట్ (స్లింగ్ పౌచ్) ధరించి కనిపించడం ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసింది. ఇప్పటివరకు దీనిపై హీరో తరఫు నుంచి గానీ, ఆయన టీమ్ నుంచి గానీ ఎలాంటి అధికారిక వివరణ రాకపోయినప్పటికీ, ఈ విజువల్స్ చూస్తుంటే ఎన్టీఆర్ ఇంకా పూర్తిస్థాయి రికవరీ సాధించలేదనే వాదనలు బలపడుతున్నాయి.

ఈ పరిణామాలు ఇప్పుడు దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రానున్న పాన్-ఇండియా చిత్రం ‘డ్రాగన్’పై పడుతున్నాయి. ఎన్టీఆర్ చేతి సమస్య కారణంగా ఇప్పటికే ఈ మూవీ షెడ్యూల్స్ పలుమార్లు వాయిదా పడ్డాయి. తాజాగా చిత్ర నిర్మాత మైత్రీ రవిశంకర్ ఈ చిత్రాన్ని 2027 జూన్ 11న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తామని ప్రకటించారు. అక్టోబర్ రెండో వారం నుంచి బ్యాలెన్స్ షూటింగ్ మొదలుపెట్టాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. అయితే సినిమాలో ఇంకా చేయాల్సినవి సాధారణ సీన్లు కావు.. ఒళ్లు గగుర్పొడిచే భారీ యాక్షన్ ఎపిసోడ్స్!

ఓ వైపు కుడిచేయి కదపడానికే ఇబ్బందిపడుతున్న పరిస్థితుల్లో, తారక్ అంతటి రిస్క్ చేసి భారీ స్టంట్స్ ఎప్పుడు చేయగలరు? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో బరిలోకి దిగితేనే అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తయి, 2027 జూన్ నాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం సాధ్యమవుతుంది. లేదంటే ‘డ్రాగన్’ రిలీజ్ డేట్ మరోసారి వాయిదా పడక తప్పదనే చర్చ టాలీవుడ్ వర్గాల్లో జోరుగా సాగుతోంది.