
Karthi: తమిళ స్టార్ హీరో కార్తీ మరో కొత్త ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా దర్శకత్వంలో ఆయన నటించనున్న కొత్త సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రిన్స్ పిక్చర్స్ నిర్మించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే కోలీవుడ్‌లో మంచి ఆసక్తి నెలకొంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రాన్ని పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంటర్టైనర్గా, కమర్షియల్ అంశాలతో తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట. భావోద్వేగాలు, వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
మరో విశేషం ఏమిటంటే.. డైరెక్టర్ మోహన్ రాజా తన సొంత కథతో తెరకెక్కిస్తున్న మూడో సినిమా ఇది. గతంలో ఆయన స్వీయ కథతో తెరకెక్కించిన ‘తని ఒరువన్’, ‘వేలైక్కారన్’ చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్‌పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. షూటింగ్‌ను ఈ ఏడాది చివరి నాటికి స్టార్ట్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే హీరోయిన్, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులతో పాటు మరిన్ని కీలక వివరాలను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.











