
Mohanlal: మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఆగస్టు 8న జరగాల్సిన ఆయన లైవ్ షో ‘వైకిట్టు ఎంథా పరిపాడి’ (What’s Programme Tonight?) వీసా సమస్యల కారణంగా వాయిదా పడింది. మోహన్‌లాల్‌కు ఆస్ట్రేలియా వీసా సకాలంలో ఆమోదం పొందకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు ప్రకటించారు. మోహన్‌లాల్ లైవ్ పెర్ఫార్మెన్స్‌ను చూసేందుకు అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే షోకు సమయం దగ్గరపడుతున్నా వీసా ప్రక్రియ పూర్తికాకపోవడంతో కార్యక్రమాన్ని నిర్వహించడం సాధ్యం కాలేదని తెలుస్తోంది. దీంతో ఇప్పటికే టికెట్లు కొనుగోలు చేసిన అభిమానుల్లో నిరాశ నెలకొంది.
‘వైకిట్టు ఎంథా పరిపాడి’ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. మోహన్‌లాల్‌తో సరదా సంభాషణలు, వినోదభరితమైన కార్యక్రమాలు, అభిమానులను అలరించే ప్రత్యేక ప్రదర్శనలు ఇందులో ఉన్నాయి. ఈ షో కోసం సిడ్నీలో భారీ ఏర్పాట్లు కూడా చేసినట్లు సమాచారం. అయితే వీసా సమస్య కారణంగా షోను పూర్తిగా రద్దు చేయకుండా వాయిదా వేసినట్లు తెలుస్తోంది. కొత్త తేదీని నిర్వాహకులు త్వరలో ప్రకటించే అవకాశం ఉంది. ప్రస్తుతం మోహన్‌లాల్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు.














