MYSAA Teaser: రష్మిక విశ్వరూపం.. ఒళ్లు గగుర్పొడిచేలా ‘మైసా’ టీజర్!

MYSAA

MYSAA Teaser: నేషనల్ క్రష్‌గా, క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్, గ్లామరస్ క్యారెక్టర్లతో ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న రష్మిక మందన్న.. ఒక్కసారిగా ఊహించని అవతారంలోకి మారిపోయింది. వెండితెరపై ఆమె చూపించిన తాజా విశ్వరూపం చూసి సినీ లవర్స్ మైండ్ బ్లాంక్ అవుతోంది. రవీంద్ర పుల్లె దర్శకత్వంలో అన్‌ ఫార్ములా ఫిల్మ్స్‌ నిర్మిస్తున్న వైవిధ్యభరిత యాక్షన్ థ్రిల్లర్ ‘మైసా’ (MYSAA). షూటింగ్ ముగింపు దశకు చేరుకుని, నవంబరు 27న బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేటకు సిద్ధమవుతున్న వేళ విడుదలైన ఈ మూవీ టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ టీజర్‌లో అందరినీ విపరీతంగా ఆకర్షించిన అంశం “యుద్ధానికి ఆయుధం అంటే భయం కానీ.. ఆయుధం ఏ యుద్ధానికీ భయపడదు” అంటూ సాగే పదునైన డైలాగ్ నరాలు తెగే ఉత్కంఠను రేకెత్తిస్తోంది. కేవలం మాటలతోనే కాకుండా, చేతుల్లో గొడ్డలి, ఆయుధాలు పట్టి శత్రు మూకలను చీల్చిచెండాడుతున్న సీన్స్ చూస్తుంటే రష్మిక నటనలో సరికొత్త కోణం ఆవిష్కృతమైందని స్పష్టమవుతోంది.

ఇప్పటివరకు తెరపై చూడని అత్యంత రౌద్రమైన గిరిజన గోండు మహిళ పాత్రలో రష్మిక ఒదిగిపోయిన తీరు అద్భుతం. ముఖమంతా రక్తపు మరకలు, గిరిజన కట్టుబొట్టు, కళ్లలో ప్రతీకార జ్వాలలను నింపుకుని ఆమె పలికించిన హావభావాలు నటనకు అసలైన పరీక్షగా నిలిచాయి. గిరిజనుల హక్కులు, వారి ఆత్మగౌరవ పోరాటం నేపథ్యంలో సాగే ఈ కథలో యాక్షన్ ఎపిసోడ్స్ రోమాలు నిక్కబొడుచుకునేలా డిజైన్ చేశారు. ముఖ్యంగా క్లైమాక్స్ రేంజ్‌లో సాగిన ఫైట్ సీన్స్ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ఈ యాక్షన్ విధ్వంసానికి ప్రముఖ సంగీత దర్శకుడు జేక్స్ బిజోయ్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన బలంగా నిలిచింది. ప్రతి ఫ్రేమ్‌ను ఎలివేట్ చేస్తూ ఆయన ఇచ్చిన స్కోర్ టీజర్‌ను థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌లా మార్చేసింది. గ్లామర్ క్వీన్ నుంచి రౌద్ర రూప ధారిగా రష్మిక చేసిన ఈ ప్రయోగం ఆమె కెరీర్‌లోనే మైలురాయిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం యూట్యూబ్‌తో పాటు ఎక్స్ (ట్విట్టర్), ఇన్‌స్టాగ్రామ్‌లలో ‘మైసా’ టీజర్ అదిరిపోయే వ్యూస్‌తో ట్రెండింగ్‌లో దూసుకుపోతోంది.