
Deepika Padukone: బాలీవుడ్ మోస్ట్ సెలబ్రేటెడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్‌వీర్ సింగ్ ఇంట మళ్లీ పండగ వాతావరణం నెలకొంది. ఈ క్రేజీ జంట జీవితంలోకి మరో చిన్నారి దేవత అడుగుపెట్టింది. దీపికా పదుకొణె రెండోసారి పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది. ఈ విషయాన్ని స్వయంగా రణ్‌వీర్, దీపికా తమ అధికారిక సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ‘వెల్‌కమ్ బేబీ గర్ల్..’ అంటూ తమ రెండో ముద్దుల కూతురికి ఆత్మీయంగా స్వాగతం పలుకుతూ ఈ దంపతులు పెట్టిన పోస్ట్ క్షణాల్లో వైరల్‌గా మారింది. 2018లో ఇరు కుటుంబాలు, సన్నిహితుల సమక్షంలో అత్యంత ఘనంగా ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట, 2024లో తొలిసారి తల్లిదండ్రులయ్యారు.
వీరికి మొదటి సంతానంగా జన్మించిన కుమార్తె ‘దువా పదుకొణె’కు ఇప్పుడు చిట్టి చెల్లెలు తోడైంది. తన బుజ్జి చెల్లెలి రాకతో అక్క దువా కూడా మురిసిపోతోందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు. వరుసగా రెండోసారి లక్ష్మీదేవి లాంటి కుమార్తె పుట్టడంతో ఈ దంపతులకు ఇది నిజంగా అమూల్యమైన క్షణమని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన వెంటనే బాలీవుడ్ ప్రముఖులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూ రణ్‌వీర్, దీపికలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నారు. ఇద్దరు ఆడపిల్లలతో వీరి ఇల్లు ఇప్పుడు మరింత సందడిగా మారనుంది.














