Taapsee Pannu: “హీరోయిన్ల సినిమాలు హిట్ అయితే నేనూ సెలబ్రేట్ చేసుకుంటా”.. తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Taapsee Pannu

Taapsee Pannu: బాలీవుడ్‌లో విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి తాప్సీ పన్ను.. తాజాగా ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాల ప్రాధాన్యతపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన సినీ ప్రయాణం, కెరీర్‌లో ఎదురైన అనుభవాల గురించి మాట్లాడిన ఆమె.. హిందీ చిత్ర పరిశ్రమలో సంప్రదాయ గ్లామర్ హీరోయిన్ పాత్రలు తనను పెద్దగా వెతుక్కుంటూ రాలేదని తెలిపారు. తనకు వచ్చిన అవకాశాల్లో ఎక్కువగా బలమైన కథ, సవాల్‌తో కూడిన పాత్రలే ఉన్నాయని పేర్కొన్నారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల నిర్మాణం విషయంలో కొంతమంది దర్శకులు, నిర్మాతలు ధైర్యంగా ముందుకు రావడం వల్లే తనలాంటి నటీమణులకు మంచి అవకాశాలు లభిస్తున్నాయని తాప్సీ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలను ప్రేక్షకులు ఆదరించడం పరిశ్రమలో కీలకమైన మార్పుకు కారణమవుతోందని చెప్పారు. మహిళా కేంద్రంగా తెరకెక్కిన ఓ సినిమా విజయవంతమైతే.. అలాంటి కథలపై పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు, పెట్టుబడిదారుల్లో మరింత నమ్మకం ఏర్పడుతుందని తెలిపారు.

ఒక హీరోయిన్ నటించిన సినిమా విజయం సాధించినప్పుడు దాన్ని కేవలం వ్యక్తిగత విజయంగా కాకుండా.. మొత్తం మహిళా నటీనటులకు దక్కిన విజయంగా చూస్తానని తాప్సీ పేర్కొన్నారు. తోటి నటీమణుల చిత్రాలు మంచి విజయాన్ని అందుకున్నప్పుడు తాను కూడా ఎంతో సంతోషిస్తానని, వాటిని సెలబ్రేట్ చేసుకుంటానని తెలిపారు. ఇలాంటి విజయాలు మరిన్ని మహిళా ప్రధాన కథలకు మార్గం సుగమం చేస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. తాప్సీ గతంలో ‘పింక్’, ‘తప్పాడ్’, ‘హసీన్ దిల్‌రుబా’ వంటి విభిన్నమైన, బలమైన కథాంశాలతో కూడిన చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. గ్లామర్‌ పాత్రలకే పరిమితం కాకుండా కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాలను ఎంచుకుంటూ తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం తాప్సీ ‘గాంధారి’ అనే యాక్షన్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. కిడ్నాప్‌కు గురైన తన బిడ్డను రక్షించుకోవడానికి ఓ తల్లి చేసే పోరాటం చుట్టూ ఈ సినిమా కథ సాగనుంది. తల్లి ప్రేమ, భావోద్వేగాలు, యాక్షన్ అంశాల మేళవింపుతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న విడుదల కానున్నట్లు సమాచారం. ఈ సినిమా తన కెరీర్‌లో మరో కీలకమైన చిత్రంగా నిలుస్తుందనే అంచనాలు ఉన్నాయి.