
Niharika : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.2గా నిహారిక కొణిదెల నిర్మిస్తున్న తాజా చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో యువ నటుడు సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించనున్నారు. కథను మానస శర్మ అందించగా, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్స్‌ను మానస శర్మ, మహేష్ ఉప్పాల సంయుక్తంగా రచించారు. ఈ చిత్రానికి మన్యం రమేష్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఫ్యాంటసీ, కామెడీ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమాకు అనుదీప్ దేవ్ సంగీతం అందించనుండగా, అన్వర్ అలీ ఎడిటింగ్ బాధ్యతలు చేపడతారు. సినిమాటోగ్రఫీని రాజు ఎడురోలు హ్యాండిల్ చేస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌కు పుల్లా విష్ణు వర్దన్, యాక్షన్ కొరియోగ్రఫీకి విజయ్ వ్యవహరించనున్నారు.
ఈ సినిమా పూజా కార్యక్రమాలు బుధవారం నాడు అన్నపూర్ణ స్టూడియోస్ గ్లాస్ హౌస్‌లో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు నాగ్ అశ్విన్, కళ్యాణ్ శంకర్, మల్లిడి వశిష్ట ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముహూర్తపు సన్నివేశానికి నాగ్ అశ్విన్ క్లాప్ ఇవ్వగా, వశిష్ట కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహించారు. రెగ్యులర్ షూటింగ్ జూలై 15 నుంచి హైదరాబాద్ మరియు పరిసర ప్రాంతాల్లో ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.









