
Operation Safed Sagar: నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ (Operation Safed Sagar) వెబ్ సిరీస్‌కు అంతర్జాతీయ స్థాయిలో మంచి స్పందన లభిస్తోంది. 1999 కార్గిల్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ఈ ఆరు ఎపిసోడ్ల సిరీస్‌లో హీరో సిద్ధార్థ్.. భారత వాయుసేనకు చెందిన స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా పాత్రలో కనిపించారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిద్ధార్థ్.. ఈ సిరీస్‌కు వస్తున్న స్పందనపై ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంతకం చేసిన రోజే ఇది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతుందని తనకు నమ్మకం కలిగిందని సిద్ధార్థ్ తెలిపారు. ప్రస్తుతం తన ఫోన్‌కు వస్తున్న కాల్స్, మెసేజ్‌లు గతంలో కంటే పూర్తిగా భిన్నంగా ఉన్నాయని చెప్పారు. ముఖ్యంగా సీనియర్ సైనికాధికారులు, త్రీ-స్టార్ జనరల్స్, ఎయిర్ మార్షల్స్ నుంచి ప్రశంసలు రావడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తోందన్నారు.
ఈ ప్రశంసలన్నీ స్క్వాడ్రన్ లీడర్ అజయ్ అహూజా చేసిన త్యాగానికి, ఆయన పట్ల ఉన్న గౌరవానికి నిదర్శనమని సిద్ధార్థ్ పేర్కొన్నారు. సిరీస్‌లో శత్రువులను బలహీనంగా చూపించలేదని, దేశభక్తి పేరుతో అనవసరమైన అతిశయోక్తులకు వెళ్లకుండా యుద్ధ పరిస్థితులను వాస్తవికంగా చూపించారని తెలిపారు. అత్యున్నత ప్రమాణాలతో రూపొందించిన విజువల్ ఎఫెక్ట్స్ కూడా సిరీస్ విజయానికి మరో కారణమని చెప్పారు. అజయ్ అహూజా పాత్రలోని ఓ సన్నివేశం తనకు ప్రత్యేకంగా నచ్చిందని సిద్ధార్థ్ వెల్లడించారు. యుద్ధానికి వెళ్లే ముందు యువ పైలట్లలో భయాన్ని, టెన్షన్‌ను తగ్గించేందుకు అహూజా సరదాగా వారితో మాట్లాడుతూ.. ‘నాకూ ఇదే తొలి యుద్ధం’ అని చెప్పే సన్నివేశం తనకు ఎంతో ఇష్టమని తెలిపారు. ఆ సన్నివేశం ఆయన వ్యక్తిత్వాన్ని చక్కగా ప్రతిబింబిస్తుందని అన్నారు. అలాగే అజయ్ అహూజా వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను తెలుసుకునేందుకు ఆయన భార్య అల్కాతో మాట్లాడినట్లు సిద్ధార్థ్ తెలిపారు. అహూజాకు ఇంజినీరింగ్, ఫొటోగ్రఫీ అంటే ఎంతో ఆసక్తి ఉండేదని ఆమె ద్వారా తెలుసుకున్నానన్నారు. ఆయన సైనికుడిగా కాకుండా మరో రంగంలో ఉండి ఉంటే తనలాగే కళాకారుడిగా మారేవారేమోనని సిద్ధార్థ్ ఆసక్తికరంగా వ్యాఖ్యానించారు. 1999 కార్గిల్ యుద్ధ సమయంలో భారత వాయుసేనకు చెందిన ‘గోల్డెన్ యారోస్’ స్క్వాడ్రన్ నిర్వహించిన సాహసోపేతమైన ఆపరేషన్ల ఆధారంగా ‘ఆపరేషన్ సఫేద్ సాగర్’ సిరీస్‌ను రూపొందించారు. యుద్ధంలో భారత వాయుసేన పాత్ర, పైలట్ల ధైర్యసాహసాలను ప్రధానంగా చూపించిన ఈ సిరీస్ ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.














