Preity Zinta: డీప్‌ఫేక్స్‌పై డింపుల్ బ్యూటీ వార్.. బాంబే హైకోర్టు మెట్లు ఎక్కిన ప్రీతి జింటా!

Preity Zinta

Preity Zinta: సినీ ఇండస్ట్రీని ప్రస్తుతం డీప్‌ఫేక్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు దీని బారిన పడగా.. తాజాగా బాలీవుడ్ డింపుల్ బ్యూటీ, సీనియర్ హీరోయిన్ ప్రీతి జింటా ఈ టెక్నాలజీ దుర్వినియోగంపై న్యాయపోరాటానికి దిగారు. తన అనుమతి లేకుండా, తన రూపం, గొంతును ఉపయోగించి క్రియేట్ చేస్తున్న డీప్‌ఫేక్స్, మార్ఫింగ్ విజువల్స్, ఏఐ ఆధారిత కంటెంట్‌పై ఆమె బాంబే హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె కోర్టులో ఒక లీగల్ సూట్ దాఖలు చేశారు.

తన పిటిషన్‌లో ప్రీతి జింటా ఇంటర్నెట్‌లో సర్క్యులేట్ అవుతున్న పలు అభ్యంతరకర వీడియోలు, ఫోటోలను ప్రస్తావించారు. కేవలం మార్ఫింగ్ విజువల్స్ మాత్రమే కాకుండా, చాట్‌బాట్ తరహా ఇంటరాక్షన్లలో కూడా తన ముఖాన్ని, వాయిస్‌ను డీప్‌ఫేక్ టెక్నాలజీ ద్వారా యథేచ్ఛగా వాడుకుంటున్నారని ఆమె కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వీటి వల్ల తన వ్యక్తిగత ప్రతిష్టకు, కెరీర్‌కు తీవ్ర భంగం వాటిల్లుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుమతి లేకుండా డిజిటల్ మాధ్యమాల్లో తన ఏఐ రూపాలను ప్రదర్శించకుండా, సదరు కంటెంట్‌ను తక్షణమే తొలగించేలా ఆర్డర్స్ ఇవ్వాలని ఆమె కోర్టును కోరారు. గతంలో అనిల్ కపూర్, అమితాబ్ బచ్చన్, రష్మిక మందన్న వంటి సెలబ్రిటీలు తమ పర్సనాలిటీ రైట్స్ కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రీతి జింటా కూడా తన డిజిటల్ హక్కుల రక్షణ కోసం బాంబే హైకోర్టును ఆశ్రయించడం టెక్నాలజీ వర్గాల్లో, చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. సోషల్ మీడియాలో ఈ న్యూస్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.