
George Krish: టాలీవుడ్ యంగ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్లో తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. సంక్రాంతి బరిలోకి దిగనున్న ఈ సినిమాను 2027 జనవరి 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అంతేకాదు.. సినిమా లాంచ్ రోజే డిస్ట్రిబ్యూషన్ రైట్స్‌ను కూడా లాక్ చేసినట్లు చిత్రబృందం వెల్లడించింది. దీంతో శర్వానంద్ సినిమాపై ఉన్న క్రేజ్ మరోసారి చర్చనీయాంశంగా మారింది. ‘జార్జ్ క్రిష్’ నైజాం రైట్స్‌ను ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్, వైజాగ్ హక్కులను వాసుదేవ మూవీ క్రియేషన్స్, ఈస్ట్‌ను వింటేజ్ క్రియేషన్స్, వెస్ట్‌ను ఆదిత్య ఫిలిమ్స్ దక్కించుకున్నాయి. కృష్ణ రైట్స్‌ను వ్యోమ్ సినిమాస్, గుంటూరు హక్కులను ఆర్కే ఎంటర్టైన్మెంట్స్, నెల్లూరు హక్కులను అభి సినిమాస్, సీడెడ్ హక్కులను శిల్పకళ సంస్థలు నిర్వహించనున్నాయి.
ఓవర్సీస్ హక్కులను వ్యోమ్, సినిమా పారడిసో సంస్థలు సొంతం చేసుకున్నాయి. శ్రీను వైట్ల మార్క్ కామెడీ, ఎంటర్టైన్మెంట్తో పాటు సరికొత్త కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా టైమ్ ట్రావెల్ టచ్‌తో కూడిన ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘జార్జ్ క్రిష్’ రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో శర్వానంద్‌ను సరికొత్త లుక్‌లో చూపించనున్నారని సమాచారం. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తుండగా, కె.వి. గుహన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కొంతకాలంగా సరైన విజయాన్ని అందుకోవాలని చూస్తున్న శ్రీను వైట్లకు ‘జార్జ్ క్రిష్’ కీలకంగా మారింది. మరోవైపు సంక్రాంతి సీజన్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న శర్వానంద్.. ఈ సినిమాతో ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటారో చూడాలి. లాంచ్ రోజే డిస్ట్రిబ్యూషన్ రైట్స్ లాక్ కావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.














