
Srikanth Odela: నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘ది ప్యారడైజ్’ మూవీ భారీ విజయంతో థియేటర్లలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా మీట్‌లో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల మాట్లాడిన మాటలు ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. షూటింగ్ సమయంలో నానికి, తనకు మధ్య తీవ్రమైన విభేదాలు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారంపై శ్రీకాంత్ అత్యంత నిర్మొహమాటంగా, కుండబద్దలు కొట్టినట్లు స్పందించారు. షూటింగ్ టైమ్‌లో నానితో వచ్చిన వివాదాలపై ఓపెన్ అవుతూ.. “సినిమా మేకింగ్ జరుగుతున్నప్పుడు మా ఇద్దరి మధ్య గొడవలు అయ్యాయని, నాని అన్న తిట్టాడని, నేను అరిచానని, అలిగానని రకరకాల వార్తలు వచ్చాయి. అవును.. అందులో నాని అన్న నన్ను తిట్టిన మాట వాస్తవమే! నేను ఆయనతో అన్న మాటలు కూడా నిజమే కావచ్చు!” అంటూ శ్రీకాంత్ సంచలన నిజాన్ని అంగీకరించారు. అయితే, ఆ గొడవల వెనుక ఉన్న లోతైన బంధాన్ని వివరిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యపరిచాయి.
“మా ఇద్దరి బంధాన్ని కేవలం ‘దసరా’ లేదంటే ‘ప్యారడైజ్’ లాంటి సినిమాల చట్రంలో పెట్టి చూడకూడదు. వేరే దర్శకులతో నాని అన్న ఎలా ఉంటారో నాకు అనవసరం. కానీ నాతో మాత్రం ఆయన నన్ను భరించాల్సిందే, నన్ను మోయాల్సిందే! ఆయనకు వేరే ఆప్షన్ లేదు. నన్ను ఇండస్ట్రీకి తీసుకొచ్చి పెట్టిందే ఆయన.. కాబట్టి ఆ బాధ్యత ఆయనదే. ఇందులో మేం తన్నుకుంటాం, తిట్టుకుంటాం, ముద్దులు పెట్టుకుంటాం.. ఏం చేసినా మా బంధం చావు బతుకులను దాటింది” అంటూ శ్రీకాంత్ తీవ్ర భావోద్వేగంతో స్పష్టం చేశారు.
ఇక ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు మోహన్ బాబు గురించి చెబుతూ శ్రీకాంత్ మరో ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. “నేను కలవకముందు మోహన్ బాబు గారి గురించి నాకు అందరూ ఒక హిట్లర్ లాగా చెప్పారు. ఆయన నీ మాట వినడు, నిన్ను కంట్రోల్ చేస్తాడు అని భయపెట్టారు. కానీ మొదటిసారి తిరుపతిలో కలిసినప్పుడే ఆయన నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు. సెట్‌లోకి వస్తే ఆయన మైండ్‌సెట్ ఎల్‌కేజీ పిల్లల కంటే చిన్న పిల్లాడిలా ఉంటుంది. మేమే పిల్లకాయలం అనుకుంటే, ఆయన మాకంటే బచ్చాలా మారిపోయేవారు. ఆయనతో పనిచేయడం నా జీవితంలో దక్కిన అతిపెద్ద అచీవ్‌మెంట్” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా చిత్రంలో భాగమైన ప్రతి ఒక్కరికీ శ్రీకాంత్ కృతజ్ఞతలు తెలిపారు. కయాదు లోహర్ చేసిన పాత్రను చాలామంది హీరోయిన్లు బోల్డ్ క్యారెక్టర్, స్కిన్ షో ఉంటుందేమోనన్న భయంతో రిజెక్ట్ చేశారని, కానీ కయాదు ఎంతో ధైర్యంతో ఆ పాత్రను ఒప్పుకొని అద్భుతంగా చేసిందని ప్రశంసించారు. అలాగే, ఏ గుర్తింపు లేకుండా వర్షంలో, బురదలో రాత్రింబవళ్లు పనిచేసిన జూనియర్ ఆర్టిస్టులకే తన మొదటి థ్యాంక్స్ దక్కుతుందని ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు. నానితో ఉన్న రూమర్లకు తనదైన స్టైల్లో సమాధానమిస్తూ శ్రీకాంత్ మాట్లాడిన తీరు ప్రస్తుతం సోషల్ మీడియాలో సెన్సేషన్‌గా మారింది. ‘నాని నన్ను భరించాల్సిందే’ అంటూ శ్రీకాంత్ చూపించిన తెగువ, వారిద్దరి మధ్య ఉన్న గాఢమైన అనుబంధాన్ని మరోసారి నిరూపించింది.













