The Paradise: 23 నుంచే రచ్చ షురూ.. ‘ది ప్యారడైజ్’ స్పెషల్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి!

The Paradise Delay

The Paradise: న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’ విడుదల సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సెప్టెంబర్ 24న ఈ చిత్రం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, టికెట్ ధరల పెంపుతో పాటు ప్రత్యేక ప్రీమియర్ షోల ప్రదర్శనకు హోంశాఖ అనుమతి మంజూరు చేసింది. ఈ మేరకు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శిఖా గోయల్ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. నిర్మాణ సంస్థ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ చేసిన విజ్ఞప్తిని పరిశీలించిన ప్రభుత్వం, సాధారణ విడుదలకు ఒకరోజు ముందే అంటే సెప్టెంబర్ 23వ తేదీ సాయంత్రం 6:30 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షో వేసుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.500గా నిర్ణయించగా, విడుదల నాటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా రోజుకు ఐదు షోలు ప్రదర్శించుకునే వెసులుబాటు కల్పించింది.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం మొదటి పది రోజుల పాటు సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లలో టికెట్లపై అదనపు చార్జీలు వర్తించనున్నాయి. మల్టీప్లెక్స్‌లు, ప్రత్యేక థియేటర్లలో సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు ఒక్కో టికెట్‌పై రూ.95, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.45 అదనంగా వసూలు చేయనున్నారు. ఇక సింగిల్ స్క్రీన్స్ విషయానికి వస్తే, సెప్టెంబర్ 24 నుంచి 27 వరకు టికెట్‌పై రూ.48, సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 3 వరకు రూ.23 అదనపు రుసుము వర్తిస్తుంది. ఈ పెంపు మొత్తాల్లో జీఎస్టీ కూడా అంతర్భాగంగా ఉంటుంది. ఇదే సమయంలో చిత్ర నిర్మాణ సంస్థకు ప్రభుత్వం ఒక కీలక షరతు విధించింది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ కమిటీ ఖాతాకు తప్పనిసరిగా రూ.1 కోటి విరాళం జమ చేయాలని ఆదేశించింది. తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (FDC) ఆధ్వర్యంలో నడిచే ఈ నిధిని సినీ కార్మికులు, ఉద్యోగుల సంక్షేమం కోసం వినియోగించనున్నారు.