
హైదరబాద్ లో ఈనెల 7 నుంచి మెట్రో రైలు సేవలను పునరుద్ధరించనున్నారు. ఈ మేరకు హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. ప్యాసింజర్‌లను బట్టి ఫ్రీక్వెన్సీపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. మెట్రో స్టేషన్లతో పాటు రైళ్లలో భౌతికదూరం పాటించేలా ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. భౌతిక దూరాన్ని సీసీటీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామన్నారు.
మెట్రో రైలు ప్రయాణికులు మాస్క్‌ను తప్పనిసరిగా పెట్టుకోవాలని.. లేనిపక్షంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా అనుమానిత లక్షణాలు లేనివాళ్లకు మాత్రమే మెట్రో రైలులో ప్రయాణించేందుకు అనుమతిస్తామని ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు. మెట్రో ఉద్యోగులకు పీపీఈ కిట్లు అందజేస్తామన్నారు. స్మార్ట్ కార్డు, క్యాష్ లెస్ విధానంలో టికెట్లు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన వివరించారు.









