
కరోనా వైరస్ వ్యాక్సిన్ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విషయంలో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ అన్నింటికంటే ముందున్నట్లు తాజాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ కట్టడి కోసం రూపొందించిన ఈ ప్రయోగాత్మక టీకాపై తదుపరి పరీక్షలు చేపట్టాలని బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు తాజాగా నిర్ణయించారు.
తొలి దశ ప్రయోగంలో మెరుగైన ఫలితాలు రావడంతో వ్యాక్సిన్ అభివృద్ధిలో కీలకమైన రెండో దశలో దాదాపు 10వేల మంది వాలంటీర్లపై ప్రయోగించేందుకు ఆక్స్‌ఫర్డ్ సిద్ధమైంది. అయితే ఈ వ్యాక్సిన్ విజయావకాశాలు కేవలం 50శాతమేనని వ్యాక్సిన్ అభివృద్ధిచేస్తున్న ఆక్స్‌ఫర్డ్ జెన్నెర్ ఇన్‌స్టిట్యూట్ డైరక్టర్ ప్రొఫెసర్ అడ్రియన్ హిల్ అభిప్రాయపడటం గమనార్హం.









