
తెలుగుమిర్చి రేటింగ్ : 2/5
యంగ్ హీరో సుహాస్ మరోసారి డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ‘ఓ భామ అయ్యో రామ’ పేరుతో వచ్చిన ఈ చిత్రం జూలై 11న విడుదలైంది. ఈ సినిమాతో మాళవిక మనోజ్ తెలుగు తెరకు పరిచయమవడం విశేషం. పూర్తి రివ్యూ లోకి వెళ్తే..
రామ్ (సుహాస్) తల్లి (అనితా హంసానందిని) ఒక క్లాసికల్ డ్యాన్సర్. భర్త మోసం చేసిన నేపథ్యంలో ఆమె తన కుమారుడిని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. తల్లిని చిన్ననాటే కోల్పోయిన రామ్‌ను మేనమామ (అలీ) పెంచుతాడు. చదువులో మక్కువ ఉన్న రామ్ ఫారెన్ వెళ్లాలని కలలు కంటూ ఎదుగుతుంటాడు. అదే సమయంలో ఓ అనుకోని కారు ప్రమాదం ద్వారా సత్యభామ (మాళవిక మనోజ్) పరిచయం అవుతుంది. అతని వ్యక్తిత్వాన్ని ఇష్టపడ్డ సత్య, అతన్ని ప్రేమిస్తుంది. తనకు ఆసక్తి లేకపోయినా, స్టార్ డైరెక్టర్ హరీశ్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరాలని బలవంతంగా ఒప్పిస్తుంది. ఒకానొక దశలో సత్యభామ అకస్మాత్తుగా రామ్‌ను దూరం పెడుతుంది. మూడేళ్ల పాటు తనను కలవొద్దని షరతు పెడుతుంది. సినిమా చూడడానికే ఇష్టపడని రామ్‌కి డైరెక్టర్‌గా మారాల్సిన అవసరం ఏమి వచ్చిందో, ఆమె అతని జీవితంలోకి వచ్చి ఎందుకు వెళ్లిపోయిందో, రామ్ తండ్రి ఎవరో, అతని పూర్తి నేపథ్యం ఏమిటో కథ ఆవిష్కరిస్తుంది. మళ్లీ రామ్, సత్యభామలు కలుసుకున్నారా లేదా అన్నది సినిమా చివరిలో తెలుస్తుంది.
కథ చెప్పుకోవడానికి కొత్తదనమేమీ కనిపించకపోయినా, సినిమా ప్రారంభంలో చూపించిన తల్లి-కొడుకు మధ్య ఎమోషన్, మెయిన్ పాత్రల పరిచయం వరకు కథ నెమ్మదిగా, స్థిరంగా సాగుతుంది. హీరో-హీరోయిన్‌ల మధ్య ఏర్పడే రిలేషన్ బొరింగుగా అనిపించవచ్చు, కానీ హీరో వ్యక్తిత్వాన్ని ఆమె అంగీకరించి అతనిని సినిమా ఇండస్ట్రీకి నెట్టే మార్గం కొంతవరకు ఆసక్తికరంగా ఉంటుంది. అయితే కొన్ని సన్నివేశాలు రిపీట్ అవుతూ ఉండటంతో ఆసక్తి తగ్గుతుంది. ఫస్ట్‌హాఫ్‌లో కొన్ని కామెడీ సీన్లు తక్కువగా నవ్వించినా, స్మశానం ఎపిసోడ్ మిశ్రమ స్పందనను తెచ్చింది.
సెకండాఫ్ లో సినిమా కొంచెం మెరుగ్గా మారుతుంది. ముఖ్యంగా తల్లి ప్లాష్‌బ్యాక్ ఎపిసోడ్ ఎమోషనల్‌గా ఉంటుంది. క్లైమాక్స్‌లో సింపుల్ ట్విస్ట్ ద్వారా కథను ముగించడం ప్రయత్నించారేమో కానీ, కథలో బలం లేకపోవడం వల్ల పూర్తిగా ప్రభావితం చేయలేకపోయింది. అసలే సినిమాల్ని ఇష్టపడని రామ్‌ని దర్శకుడిగా చేయాలని సత్యభామ ఎందుకు ప్రయత్నించిందన్న పాయింట్‌కు బలమైన న్యాయమైన బ్యాకింగ్ లేకపోవడం ఓ లోపం.
నటీనటుల పరంగా చూస్తే, సుహాస్ తన పాత్రలో సెటిల్డ్‌గా నటించాడు. మాళవిక మనోజ్ తన పాత్రకు న్యాయం చేసింది. సినిమా మొత్తం మీద ఆమె పాత్రే కొంతమేరకు రిలీఫ్‌ని ఇచ్చినట్టు అనిపిస్తుంది. అనిత హంసానందిని తల్లి పాత్రలో ఆకట్టుకుంది. అలీ మేనమామగా ప్రేక్షకుల్ని నవ్వించేందుకు ప్రయత్నించాడు. హరీష్ శంకర్, మారుతి అతిథి పాత్రల్లో కనిపించడం ఆసక్తికరంగా అనిపించింది. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ ఓ మోస్తరుగా ఉన్నా, కథకీ, కథనానికీ గందరగోళం ఉండటంతో సినిమా పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. మొత్తం మీద ‘ఓ భామ అయ్యో రామ’ – కొంతమేరకు నచ్చే ఎమోషన్ ఉన్నా, ఆశించినంతగా మెప్పించని ప్రయోగాత్మక కథ.
తెలుగుమిర్చి రేటింగ్ : 2/5









