
రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కి మంచి ఆదరణ లభిస్తుంది. ప్రముఖ రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు, క్రీడా ప్రముఖులు ఇందులో భాగం అవుతున్నారు. ఇప్పటికే పలువురు ఛాలెంజ్ లో పాల్గొని మొక్కలు నాటుతూ మరికొంతమందికి విసురుతున్నారు. తాజాగా ఈ ఛాలెంజ్ ను నటుడు నందు స్వీకరించారు.
బుధవారం సైదాబాద్ ఎస్బీహెచ్ కాలనీలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నందు మాట్లాడుతూ.. ఎంపీ సంతోష్ మొదలు పెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ చాలా మంచి కార్యక్రమం అని, అందులో తాను కూడ భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉందని అన్నారు.
ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మరికొంత మంది సినీ ప్రముఖులకు నందు విసిరారు. ‘‘మా ‘సవారి’ చిత్ర బృందం సభ్యులు అయిన హీరోయిన్ ప్రియాంక శర్మ, దర్శకుడు సాహితి మోత్కూరి, సంగీత దర్శకుడు శేఖర్ చంద్ర, శ్రీకాంత్, జీవన్లను ఈ ఛాలెంజ్‌కు నామినేట్ చేస్తున్నాను. వారు మొక్కలు నాటాలని కోరుతున్నాను. అదేవిధంగా ప్రజలందరూ స్వతహాగా ఎవరికివారు మనిషికి ఒక మొక్క చొప్పున అయినా నాటాలి’’ అని అన్నారు.









