
Directorial Debut: టాలీవుడ్‌లో హీరోలు దర్శకులుగా మారడం ఇప్పుడు కొత్త ట్రెండ్‌గా కనిపిస్తోంది. ఇటీవల ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని తానే హీరోగా నటిస్తూ, దర్శకుడి కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే బాటలో మరో హీరో సుధీర్ బాబు కూడా నడుస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. సుధీర్ బాబు త్వరలో ఓ కొత్త చిత్రాన్ని స్వయంగా దర్శకత్వం వహించనున్నారని తెలుస్తోంది. విశేషమేంటంటే.. ఈ సినిమాకు కథను కూడా ఆయనే సిద్ధం చేశారని, దర్శకత్వంతో పాటు హీరోగా కూడా నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.
నటుడిగా విభిన్న కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సుధీర్ బాబు, ఇప్పుడు దర్శకుడిగానూ తన ప్రతిభను చాటుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ‘జటాధర’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, సూపర్‌నేచురల్ మిస్టరీ, డివోషనల్ హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ సినిమాతో భిన్నమైన కథను ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు తన సొంత ఆలోచనలతో రాసుకున్న కథతో వెండితెరపై సరికొత్త సినిమాను ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు సమాచారం. హీరోయిన్, ఇతర నటీనటులు, నిర్మాణ సంస్థ వంటి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని టాక్ వినిపిస్తోంది. అయితే సుధీర్ బాబు దర్శకత్వ అరంగేట్రంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు. ఇప్పటికే నటుడిగా తనదైన ముద్ర వేసిన సుధీర్ బాబు దర్శకుడిగానూ సక్సెస్ సాధిస్తారా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.














