
HYDRA Commissioner: హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ తనపై వచ్చిన విమర్శలు, కోర్టు ధిక్కార కేసుల నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హైడ్రా కమిషనర్‌గా గత రెండేళ్లుగా రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా విధులు నిర్వర్తించానని, ప్రభుత్వ ఆస్తులు, చెరువులు, పార్కులను పరిరక్షించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48A స్ఫూర్తితో పని చేశామని, ఈ కాలంలో మార్కెట్ విలువ సుమారు రూ.1.50 లక్షల కోట్లకు పైగా ఉన్న ప్రభుత్వ భూములను రక్షించగలిగామని పేర్కొన్నారు. గత రెండేళ్లలో ఆరు చెరువులను పూర్తిస్థాయిలో పునరుద్ధరించామని, మరో 20 చెరువుల పునరుద్ధరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. వందలాది చెరువులు, పార్కులు, వేల ఎకరాల ప్రభుత్వ భూములను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించినట్లు వెల్లడించారు. నిజాయితీ, నిబద్ధతతో పనిచేస్తున్నందుకే హైడ్రాపై ప్రజలకు విశ్వాసం ఉందని అన్నారు.
లోతుకుంట భూముల వివాదంపై కూడా రంగనాథ్ స్పందించారు. సుమారు రూ.10 వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ సంస్థ ఆక్రమించేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. అనుమతులు లేకుండానే హెరిటేజ్ రాళ్లను పేల్చివేయడం, వందలాది చెట్లను నరికివేయడం జరిగిందని తెలిపారు. సేవ్ ది రాక్స్ సొసైటీ, పర్యావరణవేత్తలు, స్థానికుల ఫిర్యాదుల ఆధారంగానే హైడ్రా చర్యలు చేపట్టిందని చెప్పారు. అనంతరం ప్రభుత్వ భూమిని ఆక్రమించిన వారే తనపై కోర్టు ధిక్కార పిటిషన్లు దాఖలు చేశారని ఆరోపించారు. ప్రస్తుతం తనపై మొత్తం 63 కోర్టు ధిక్కార కేసులు ఉన్నాయని, వాటిలో చాలా వరకు భూ ఆక్రమణలకు పాల్పడిన వ్యక్తులే దాఖలు చేశారని రంగనాథ్ పేర్కొన్నారు. బతుకమ్మకుంట చెరువు, లోతుకుంట ప్రభుత్వ భూములు, సింగరేణి కార్మికుల ప్లాట్లు, సామాన్యుల భూములను కాపాడేందుకు చర్యలు తీసుకోవడమే తన తప్పుగా మారిందని వ్యాఖ్యానించారు. అయితే తనకు న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసం ఉందని, అన్ని కేసులను చట్టపరంగానే ఎదుర్కొంటానని రంగనాథ్ స్పష్టం చేశారు. గతంలోనూ, ప్రస్తుతం కూడా, భవిష్యత్తులోనూ ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా అదే నిబద్ధతతో పనిచేసి వందశాతం ఫలితాలు ఇవ్వడమే తన లక్ష్యమని తెలిపారు.













