
Magudam OTT Release: వెండితెరపై బోల్తా పడిన సినిమాలు సైతం ఓటీటీలోకి రాగానే అనూహ్యంగా ప్రజాదరణ పొంది సంచలనాలు సృష్టించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. తాజాగా యాక్షన్ హీరో విశాల్ నటించిన హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ‘మగుడం’ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోయిన ఈ చిత్రం, అమెజాన్ ప్రైమ్‌లో అడుగుపెట్టిన క్షణం నుంచే వ్యూవర్షిప్ రికార్డులను తిరగరాస్తూ టాప్ ట్రెండింగ్‌లో నిలిచింది. ఆగస్టు 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రానికి దాదాపు మూడు గంటల సుదీర్ఘమైన నిడివి, సాగదీసినట్టున్న స్క్రీన్‌ప్లే ఆకట్టుకోకపోవడంతో మిక్సిడ్ టాక్రను మూటగట్టుకుంది. అయితే సెప్టెంబర్ 11న ఓటీటీలోకి వచ్చిన ఈ చిత్రం అనూహ్యంగా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై అగ్రస్థానాన్ని కైవసం చేసుకుని విశాల్ టీమ్‌కు ఊహించని జోష్ నింపింది.
ఈ ఘనతపై విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ స్పందిస్తూ.. “వెండితెర నుంచి మీ ఇళ్ల వరకు ప్రేక్షకుల అభిమానం నిరంతరాయంగా కొనసాగుతోంది” అంటూ హర్షం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో విశాల్ త్రిపాత్రాభినయంతో ఆకట్టుకోగా, అంజలి, దుషారా విజయన్ కీలక పాత్రల్లో అలరించారు. మరోవైపు, సోషల్ మీడియాలో నెటిజన్లు, ఫ్యాన్స్ ఈ సినిమాపై రకరకాల సరదా మీమ్స్, ‘ట్రోల్ నెం.1’ తరహా వీడియోలతో విపరీతమైన బజ్ క్రియేట్ చేస్తున్నారు. థియేటర్లలో మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఒక సినిమా.. ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై చార్ట్‌బస్టర్‌గా మారి ఇంతటి క్రేజ్ సొంతం చేసుకోవడం ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.














