Medaram Jathara 2026 : మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 తేదీలు ఖరారు !


Medaram Jathara 2026 : ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 2026 తేదీలు ఖరారయ్యాయి. ఈ మహా జాతర వచ్చే ఏడాది(2026) జనవరి 28 నుంచి 31 వరకు జరగనుందని మేడారం పూజారుల సంఘం ప్రకటించింది. తొలిరోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను, గోవింద రాజు, పగిడిద్ద రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర ప్రారంభమవుతుంది. 29న చిలకల గుట్ట నుంచి సమ్మక్క అమ్మవారు గద్దెకు చేరుకుంటారు. 30న భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. జాతర చివరి రోజు 31న సాయంత్రం 6 గంటలకు తిరిగి సమ్మక్క సారలమ్మ అమ్మవార్లు, గోవింద రాజు, పగిడిద్ద రాజులు వన ప్రవేశం చేస్తారు. దీంతో ఈ మహా జాతర ముగుస్తుంది.

Also Read :  బస్తీ బాట పట్టిన కిషన్ రెడ్డి.. ప్రజలతో ముఖాముఖి!

“తెలంగాణ కుంభమేళా”గా పిలిచే ఈ జాతర ప్రతీ రెండు సంవత్సరాలకు ఒకసారి నిర్వహించబడుతుంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం మేడారంలో జరగనున్న ఈ జాతరకు తెలంగాణతో పాటు చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక్కడికి వచ్చే భక్తులు అమ్మవార్లకు బంగారంగా పిలుచుకునే బెల్లాన్ని సమర్పించుకుంటారు. ఇక ఈ భక్తి మహోత్సవానికి అవసరమైన ఏర్పాట్లను సకాలంలో చేపట్టాలని కోయ పూజారులు తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.