
కరోనా వైరస్ గాలిద్వారా వ్యాపిస్తోందన్న వాదన గత కొన్నిరోజులుగా మొదలైన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతూ దాదాపు 200మందికిపైగా శాస్త్రవేత్తలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాశారు. పరిశీలన అనంతరం గాలిద్వారా వైరస్ వ్యాపించే అవకాశాన్ని అంగీకరించిన డబ్ల్యూహెచ్ఓ, కొన్ని పరిస్థితుల్లో మాత్రమే ఇది సాధ్యమని స్పష్టం చేసింది.
ముఖ్యంగా రెస్టారెంట్లు, లైవ్ షో ప్రదేశాలు, వ్యాయామ తరగతులు నిర్వహించే ప్రదేశాల్లో మాత్రమే వైరస్ గాలిలో వ్యాపించే అవకాశాలను అధ్యయనాలు సూచిస్తున్నాయని తెలిపింది. వైరస్ సోకిన వ్యక్తులు మాట్లాడటం, దగ్గినప్పుడు తుంపరులు కొంతశాతం గాలిలో ఉండిపోతాయని ఆస్ట్రేలియా, అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు వాదిస్తున్నారు. ఈ సందర్భంలో జాతీయ, అంతర్జాతీయ నిపుణులు, అధికారులు దీన్ని పరిగణనలోకి తీసుకొని కఠినమైన రక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.









